Government Focus to Built School Hubs In Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ కసరత్తులో సర్కార్ జోరు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు వేర్వేరుగా ఉన్నాయి. అన్ని రకాల గురుకులాలను కలిపి ఒకే చోట ఎడ్యుకేషనల్ హబ్‌గా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. గురుకులాలన్నీ ఒకే చోట ఉన్నట్లయితే వాటి నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవటం ద్వారా వారిలో ప్రతిభా పాఠవాలు పోటీ తత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడుతున్నారు.
అన్ని కులాల వారికే ఒకే దగ్గర : ప్రతీ నియోజకవర్గం కేంద్రంలో సుమారు 20 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గ కేంద్రంలో 20 ఎకరాలు ఒకే చోట లేనట్లయితే అదే సెగ్మెంట్‌లోని మరో పట్టణం లేదా మండల కేంద్రంలో కట్టాలని భావిస్తోంది. ఇప్పటికే 20 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న గురుకులాల్లో మిగతా భవనాలు కూడా నిర్మించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా ఉన్న మధిర నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికే 20 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా అనువైన స్థలాలను గుర్తించాలని అధికారులను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు.
నిధుల సేకరణపై ప్రభుత్వం కసరత్తు : ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సముదాయాల నిర్మాణాల నమూనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నత అధికారులు పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌ల నిర్మాణానికి రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో పాటు విరాళాలను కూడా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్పొరేట్ సంస్థలు, కంపెనీల సీఎస్ఆర్ నిధులతో పాటు దాతల విరాళాలు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
విద్యార్థులు భద్రమేనా- స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై స్పెషల్ స్టోరీ - school bus fitness
11 వేల మందితో తైక్వాండో ప్రదర్శన - దాసోహమన్న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్