Semi Deluxe Buses in Telangana : ఆదాయం పెరిగేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) కొత్త దారులు వెతుకుతోంది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం కావడం వల్ల పలువురి ప్రయాణికలు సీట్లు దొరక్క ఇబ్బందిపడుతుండటంతోపాటు సంస్థకు రోజు వారీ ఆదాయం భారీగా తగ్గుతోంది. మరోవైపు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి జీరో టికెట్ల డబ్బును ప్రభుత్వం రీయింబర్స్ చేస్తున్నా అందుకు కొంత ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు పాత రాజధాని ఏసీ బస్సులకు మార్పులు చేసి ‘సెమీ డీలక్స్’ బస్సుగా నామకరణం చేశారు.
వీటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు. పాత బస్సుల ఛాసిస్, ఇంజిన్ యథావిధిగానే ఉంచి కేవలం బాడీ, సీటింగ్, రంగు మాత్రమే మార్చారు. ఎక్స్‌ప్రెస్‌లతో పోల్చితే సెమీ డీలక్స్ ఛార్జీలు 10 శాతం అధికంగా ఉన్నాయి. ఏ సేవల్లోనైనా ఛార్జీ, ధరలు పెరిగితే దానికి అనుగుణంగా సౌకర్యాలు ఉండాలి. కానీ ఈ కొత్త సెమీ డీలక్స్ బస్సులో రంగు మారడం తప్ప ఎక్స్‌ప్రెస్‌కు మించి అదనపు సౌకర్యాలేమీ లేకపోవడం గమనార్హం. తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 110 సెమీ డీలక్స్ బస్సుల్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇందులో హైదరాబాద్ జోన్‌కు 40 కాగా కరీంనగర్ జోన్‌కు 70 బస్సులు కేటాయించనున్నట్లు తెలిసింది.
పల్లెవెలుగు కంటే ఎక్కువ సీట్లు : వీటిలోనే తొలిదశలో 36 బస్సులు రానున్నాయి. ఇందులో పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్-2 డిపోకి 6, నిర్మల్ డిపోకి 2 కేటాయించారు. నిజామాబాద్-2 డిపోకి కేటాయించిన 6 బస్సులను నిజామాబాద్-నిర్మల్, బాన్సువాడ-జేబీఎస్, నిజామాబాద్-ఆదిలాబాద్ రూట్లలో ప్రారంభించారు. నిర్మల్ డిపోకి కేటాయించిన బస్సులను వెసులుబాటు ఆధారంగా నిర్మల్-నిజామాబాద్, నిర్మల్-ఆదిలాబాద్, నిర్మల్-హైదరాబాద్ లేదా నిర్మల్-మంచిర్యాల మార్గంలో నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు.
మహాలక్ష్మి పథకం ప్రభావంతో బస్సుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులు, పురుషులు సీట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు ఎక్కువగా ప్రయాణించే రూట్లలో సెమీడీలక్స్ బస్సులు నడుపుతున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఈటీవీ భారత్‌కు తెలిపారు. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ బస్సులో ఎడమవైపు 2, కుడివైపు 3 సీట్ల వరుసలు ఉంటాయి. అదే డీలక్స్‌లో అటు, ఇటు సమానంగా రెండేసి సీట్లు ఉంటాయి. కొత్త సెమీ డీలక్స్ బస్సులో మాత్రం ఎక్స్‌ప్రెస్‌ల మాదిరిగానే సీటింగ్ ఉంది. పల్లెవెలుగుల్లోనే 55 సీట్లు ఉంటే సెమీ డీలక్స్‌లలో మాత్రం ఏకంగా 60 సీట్లు కేటాయించారు. సెమీ డీలక్స్‌గా పాత రాజధాని ఏసీ బస్సులను వినియోగించడం, అవి 12 మీటర్ల పొడవు ఉండటంతో ఎక్కువ సీట్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.