TGPSC Group3 Exam : రాష్ట్రంలో గ్రూప్-3 అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షను నిర్వహించనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన టీజీపీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్- 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2 పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే, నవంబర్ 18వ తేదీన పేపర్ 3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. నవంబర్ 10వ తేదీన హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఆలస్యంగా వస్తే నో ఎంట్రీ : గ్రూప్-3 పరీక్ష ఫస్ట్ సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల లోపే ఎగ్జామ్ సెంటర్లలోనికి అనుమతిస్తారు. మార్నింగ్ సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తామని ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు తేల్చి చెప్పారు.
హాల్‌టికెట్లు మీ వద్దే ఉంచుకోండి : ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లు, క్వశ్చన్‌పేపర్లను జాగ్రత్త చేసుకోవాలని అభ్యర్థులకు బోర్డ్ సూచించింది. డూప్లికేట్ హాల్‌టికెట్లను తర్వాత జారీ చేయబోమని తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 1380కి పైగా గ్రూప్-3 ఉద్యోగాలకు 5.36 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల అనంతరం డిసెంబర్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ గతంలోనే విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఇటీవలే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించింది. తొలుత అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయాలని ఆందోళనలు నిర్వహించారు. సర్వోన్నత న్యాయస్థానం సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పడంతో టీజీపీఎస్సీ మెయిన్స్ పరీక్షను నిర్వహించింది.