TGPSC Group-1 Mains Candidate Selection 2024 : గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరగనుంది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 29, 55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-1 మెయిన్స్‌కు ఒకటి నిష్పత్తి 100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకొని అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని టీజీపీఎస్సీని ఆదేశించిన నేపథ్యంలో కమిషన్ కీలక ప్రకటన చేసింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు 1 నిష్పత్తి 100 శాతంలో ఎంపిక చేయాలని కొరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం వారి అభ్యర్థనలను పరిశీలించి వీలైనంత త్వరగా చట్టానికి లోబడి కమిషన్ తగు నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించిన సర్వీస్ కమిషన్ 1:100 పద్థతి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనలో 1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నట్లు కమిషన్ తెలిపింది.
టీజీపీఎస్సీ కీలక నిర్ణయం - పోటీ పరీక్షల ‘కీ’ సమస్యలకు చెక్ - TGSPSC Key Paper Issue
విజ్ఞప్తులను తిరస్కరించారించడానికి కారణాలు...
- 2024 ఫిబ్రవరి 19వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగానికి ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9న ఉదయం నిర్వహించింది.
- ప్రధాన పరీక్షకు మల్టీజోన్ 1, 2 వారీగా 1 నిష్పత్తి 50గా కాకుండా 1 నిష్పత్తి 100 అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు.
- సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన జీవో నెంబర్.55 (తేదీ 25/04/2022), దీన్ని సవరణ చేస్తూ జారీ చేసిన జీవో నం.29కి లోబడి గ్రూప్-1 ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొంటూ ఉద్యోగ ప్రకటన జారీ అయింది.
- 1:50 నిష్పత్తిలో ఎంపిక విషయమై జీవోలోని పేరా నెంబర్.5లో స్పష్టంగా ఉంది. ప్రతి మల్టీజోన్‌లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేస్తారని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనలు -1996 లోని 22, 22 ఏ ప్రకారం సంబంధిత రిజర్వుడ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే, అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని జీవోలో స్పష్టం చేసింది.
- మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికపై ఉద్యోగ ప్రకటనలో నెంబర్. 02/2024లోని పేజి నెంబర్.16లోని పేరా 12 లోని పేరా 'బీ' లోనూ 1 నిష్పత్తి 50గా ఎంపికపై స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి కమిషన్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనల్ని వెలువరించి భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన తరువాత వాటిని తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది.