TGNAB Special Drive On Drug Addicts in Telangana : టీజీన్యాబ్ మత్తు పదార్థాల సరఫరాదారులు, విక్రేతలతోపాటు వాటికి అలవాటుపడి భవిష్యత్తును నాశనం చేసుకునంటున్న యువతను గుర్తించేందుకు స్పెషల్ ఫోకస్ చేసింది. పెడ్లర్ల నుంచి సేకరించిన సమాచారంతో పాటు ర్యాండమ్‌గా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 40వేల మందికి వైగా గుర్తించింది. వారికి కౌన్సిలింగ్ ఇస్తూ మత్తు నుంచి బయటపడేలా సూచనలు ఇస్తుంది. అయితే ప్రతి 100మందిలో 90మంతి మిత్రుల ప్రోద్బలంతోనే మొదటిసారి గంజాయి తాగామని, తరువాత అది వ్యసనంగా మారిందని చెబుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
ఐఏఎస్ కావాల్సిన కుమారుడు గంజాయి తీసుకున్నాడంటూ : వరంగల్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న వ్యక్తికి ఇద్దరు కుమారులు. బీటేక్ పూర్తి చేసిన పెద్దకుమారుడు సివిల్స్‌పై ఆసక్తి ఉందనడంతో రూ.2లక్షలు అప్పు చేసి మరి హైదరాబాద్‌లో అశోక్ నగర్‌లోని ఓ ప్రముఖ శిక్షణ సంస్థలో చేర్పించారు. కొన్నాళ్లకు తన తండ్రికి పోలీసులు ఫోన్ చేసి మీ కుమారుడు గంజాయికి బానిసయ్యాడని చెప్పడంతో నిర్ఘాంతపోయాడు. కేసు పెట్టొద్దని, తన కుమారుడిని మాములు మనిషిని చేయాలని అధికారులను ప్రాధేయపడ్డాడు.
ఖమ్మంలో చిరువ్యాపారం చేస్తున్న వ్యక్తంటే చుట్టుపక్కల అందరికి గౌరవం. తనకి ఉన్నది ఒక్కడే వారసుడు. ఎంటెక్ చదివి ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ అతను ఒత్తిడి నుంచి బయటపడేందుకు డార్క్‌వెబ్ ద్వారా ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ వంటివి కొని వినియోగించేవాడు. ఇటీవల పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించగా అతను పట్టుబడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ కుటుంబం ప్రస్తుతం అతన్ని కలిసేందుకు వెనుకాడుతోంది.
కూమార్తె గురించి ఫోన్ చేసి : నెల్లూరు జిల్లాకి చెందిన మహిళా తన భర్తను కోల్పోయింది. అయినా కూలీ పని చేస్తూ తన కూమార్తె ఉన్నత చదువులు చదివించింది. ఆమె కష్టాన్ని వమ్ము చేయకుండా కూతురు కూడా మంచిగా చదివి హైదరాబాద్‌లో కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. కానీ ఇక్కడ వారాంతరాల్లో పబ్‌లకు వెళ్తూ మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడింది. అమ్మాయిని గుర్తించిన పోలీసులు తల్లికి సమాచారం ఇచ్చి పంపించేశారు.
డ్రగ్స్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి : సాధారణంగా మద్యం తాగినవారిని గుర్తించడానికి బ్రీత్ ఎనలైజర్లు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం సేవించారా లేదా అన్న విషయం అప్పటికప్పుడే తెలుస్తుంది. కానీ గంజాయి, డ్రగ్స్ తీసుకున్నవారిని గుర్తించాంటే మూత్ర, రక్త, లాలాజల నమూనాల పరీక్షలు చేసి సైకోయాక్టివ్ కాంపౌండ్‌ను కనిపెట్టాలి. ఈ నమూనాలు తీసుకుని ల్యాబ్‌కు పంపిస్తే కొన్ని రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి. కానీ టీజీన్యాబ్ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక డ్రగ్స్ టెస్టింగ్ కిట్లను వినియోగించడం మొదలుపెట్టింది. దీంతో వివిధ రకాల మత్తుపదార్థాల వినియోగదారులను ఇట్టే గుర్తిస్తున్నారు.
మూత్ర నమూనాల పరీక్షలతో కేవలం రెండు నిమిషాల్లో వారు డ్రగ్స్, గంజాయి తీసుకున్నారన్న విషయాన్ని కనిపెడుతున్నారు. వర్సిటీలు, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలు, పబ్బుల్లో ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి పిలిపిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని డీ- ఎడిక్షన్ కేంద్రాలకు పంపిస్తున్నారు. మరికొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో ఇంటికి పంపుతున్నారు.
బాధితులకు అరకొర సేవలు : అధికారులు డ్రగ్స్ బాధితులను గుర్తించి డీ- ఎడిక్షన్ కేంద్రాలకు పంపిస్తున్నా అక్కడ వారికి తగిన సేవలు అందడం లేదు. దీంతో ఇటీవల టీజీన్యాబ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్రగ్స్ డీ-ఎడిక్షన్ కేంద్రాలను తనిఖీచేసింది. వీటిలో కొన్నిచోట్ల డ్రగ్స్ నిర్ధారణ కిట్లు లేవని, కేవలం 10మంది పట్టే కేంద్రంలో 60మందికి చికిత్స అందిస్తున్నారని తేలింది. మరికొన్ని చోట్ల వైద్యులు, మానసిక నిపుణులు లేకుండానే కేంద్రం కొనసాగిస్తున్నట్లు బయటపడింది.
డీ-ఎడిక్షన్ సెంటర్లే లేవు : కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డీ-ఎడిక్షన్ సెంటర్ ఉన్నట్లు ఆనవాళ్లు కూడా లేకపోవడం ఆందోళన కలిగించింది. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారికి తిరిగి మామూలు పరిస్థితికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ఒక్కొక్కరిపైన నెలకు రూ.15వేల వరకు ఖర్చు చేస్తుంది. రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపుతూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు. ఆయా సంస్థలపై టీడీన్యాబ్ అధికారుల సమాచారంతో ప్రభుత్వం వారిని విచారించాలని ఆదేశించినట్లు సమాచారం.