VC Sajjanar on Organ Donation Campaign in Hospital : ఎవరైనా మరణించిన తర్వాత వారి దేహాలను ఖననం లేదా దహనం చేస్తుంటారని, అలా చేసేముందు వారి శరీరంలో ముఖ్యమైన అవయవాలు దానం చేస్తే కొందరి ప్రాణాలు నిలుస్తాయని రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మరణానంతరం తాను తన అవయవాలు దానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేస్తున్నానని, ప్రజలందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం ఆగస్టు 13న జరగబోయే ప్రపంచ అవయవదాన దినోత్సవ సందర్భంగా కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో అవయవదాన అవగాహన ప్రచార ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ మేరకు సజ్జనార్ ప్రతిజ్ఞ చేసి అవయవదాన అవగాహన ప్రచారాన్ని ప్రారంభించి క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. ప్రజలందరూ ముందడుగు వేసి, అవయవదాతలుగా మారాల్సిన అవసరం ఉందని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కామినేని ఆసుపత్రిని అభినందించారు. ఇటీవల ఇలాంటి కార్యక్రమం చూడలేదని, అవయవదానం గురించి అవగాహన కల్పించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. కొవిడ్ సమయంలో కామినేని ఆస్పత్రి చేసిన సేవలు అపూర్వమని కొనియాడారు. ముఖ్యంగా అవయవదానం విషయంలో చాలా అవగాహన రావాలని, కొన్ని లక్షల మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

జీవితంలో లభించే సెకండ్ ఛాన్స్ కోసం : ప్రభుత్వ సమాచారం ప్రకారం గత సంవత్సరం దేశంలో 18,378 డొనేషన్లు అయితే, వాటిలో లైవ్ డొనేషన్లు 15,436, కెడావర్ డొనేషన్లు 2,942చొప్పున ఉన్నాయని వీసీ సజ్జనార్ వెల్లడించారు. లైవ్ డొనేషన్లలో కూడా అత్యధికం అంటే దాదాపు పదివేలకుపైగా మహిళలే చేశారని తెలిపారు. మూడోవంతు మాత్రమే పురుషులు ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఒక ట్రాన్స్‌జెండర్ కూడా అవయవదానం చేయడం విశేషమని కొనియాడారు. మాతృప్రేమ ఇందులో స్పష్టంగా తెలుస్తోందని, పది సంవత్సరాల క్రితం 4,490 మంది మాత్రమే మొత్తం అవయవదానాలు చేశారని వివరించారు. ఇప్పుడు ఇంత పెరగడానికి వివిధ ఆస్పత్రులు, ప్రభుత్వాలు చేస్తున్న అవగాహన కార్యక్రమాలే కారణమని పేర్కొన్నారు.
కామినేని ఆస్పత్రుల సీఓఓ గాయత్రీ కామినేని మాట్లాడుతూ అనేకమంది రోగులు తమకు జీవితంలో లభించే సెకండ్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో జాతీయ సగటును మించి తెలుగు రాష్ట్రాల్లో అవయవదానాలు జరగాలని ఆశించారు. అవయవదాన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఆసుపత్రిలో తాము ప్రారంభించామని, ప్రతి ఒక్కరూ పేర్లు నమోదు చేసుకుని ఇక్కడ ఉన్నవారికి ఒక ఆశ కల్పించాలని కోరారు.
క్యూఆర్ కోడ్ విడుదల : అవయవదానం చేయాలనుకునే వారికి వీలుగా కామినేని ఆస్పత్రి క్యూఆర్ కోడ్ విడుదల చేసింది. 18 ఏళ్లు నిండిన ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్‌లోని క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఒక దరఖాస్తు ఫారం వస్తుంది. దాన్ని నింపి, సబ్మిట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ అవయవదాతలుగా మారొచ్చు.