TDP Candidates Final List Release: 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ 144 మంది అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం నాలుగు జాబితాల్లో అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. నలుగురు ఎంపీ పెండింగ్ అభ్యర్థులు, 9మంది అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ తుది జాబితా విడుదలైంది. మరోవైపు నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజుని వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలో దింపేందుకు కూటమి అధినాయకత్వంలో కీలక చర్చ నడుస్తోంది. అభ్యర్థులంతా ఖరారైన నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. తమ్ముళ్లు కదనోత్సాహంతో దూసుకుపోతున్నారు.
నలుగురు ఎంపీ అభ్యర్థులు: పెండింగ్ లో ఉన్న నాలుగు పార్లమెంట్ స్థానాలకు తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఊహించినట్లుగానే విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని ఈసారి తూర్పు కాపు సామాజికవర్గానికి కేటాయించారు. ఈ స్థానానికి బంగర్రాజు, కిమిడి నాగార్జున, మీసాల గీతలు పోటీపడినప్పటికీ అనూహ్యంగా యువనేత కలిశెట్టి అప్పలనాయుడుకు అవకాశం దక్కింది. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మాగుంట శ్రీనివాసుల రెడ్డా లేక ఆయన తనయుడు రాఘవరెడ్డా అనే సందిగ్థత వీడింది. అధిష్ఠానం ఆలోచన మేరకు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈసారి ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్నారు. అనంతపురం పార్లమెంట్ స్థానానికి జేసీ పవన్ రెడ్డి, పోల నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, కంబూరి నాగరాజులు పోటీ పడగా, అనూహ్యంగా బీసీ బోయ సామాజికవర్గానికి చెందిన లక్ష్మీనారాయణకు అదృష్టం వరించింది. కడప ఎంపీ అభ్యర్థిగా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి రేసులో ఉన్నప్పుటికీ జమ్మలమడుగు తెలుగుదేశం ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిని ఎంపిక చేశారు. పొత్తులో భాగంగా జమ్మలమడుగు స్థానం భాజపాకు కేటాయించి అక్కడి నుంచి భూపేష్ రెడ్డి రెడ్డి బాబాయ్ ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు.
మరో 9మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన చంద్రబాబు: కదిరి అసెంబ్లీకి కందికుంట ప్రసాద్ భార్య యశోదా బదులుగా కందికుంట ప్రసాద్ కు సీటు సర్దుబాటు చేశారు. చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచే పోటీ చేయనున్నారు. పాడేరు అభ్యర్థిగా కిళ్లు వెంకట రమేష్ నాయుడు, దర్శి అభ్యర్థిగా గొట్టిపాటి లక్మీ, రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు అభ్యర్థిగా వీరభద్రగౌడ్, గుంతకల్లు అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్లను ప్రకటించారు. పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులందరినీ తెలుగుదేశం ప్రకటించింది. కూటమి పక్షాలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పోటీ చేసే 144 అసెంబ్లీ అభ్యర్థుల్లో 34మందికి, 17పార్లమెంట్ స్థానాల్లో ఆరుగురు బీసీలకు అవకాశం కల్పించింది.
నాలుగు విడుతల్లో అభ్యర్థుల ప్రకటన: ఫిబ్రవరి 24న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను (TDP and Janasena first list) తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలిసి విడుదల చేశారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. రెండో జాబితాలో 34 మందితో కూడిన లిస్ట్‌ను ఆ పార్టీ విడుదల చేసింది. వీరిలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు. ఇక మూడో జాబితాలో 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పలు చోట్ల, టీడీపీ, జనసేన అభ్యర్థుల ఆందోళన, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ కారణాలతో స్వల్ప మార్పులు చేర్పులు జరిగాయి. మూడు పార్టీల సమన్వయంతో తెలుగుదేశం నేడు పార్టీ తాజాగా నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ - జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్‌సభలను టీడీపీ కేటాయించిన విషయం తెలిసిందే.