CM Revanth Reddy in Singapore : సింగపూర్ లో రాష్ట్ర బృందం మూడు రోజుల పర్యటన ఇవాళ ప్రారంభమైంది. గురువారం రాత్రి 10 గంటలకు దిల్లీ విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం ఈ ఉదయం సింగపూర్‌కు చేరుకుంది. సింగపూర్‌లోని ఛాంగీ విమానాశ్రయంలో సీఎం, మంత్రి, ఉన్నతాధికారులకు అక్కడి తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో రాష్ట్ర ప్రతినిధి బృందం సమావేశమైంది. వివిధ రంగాల్లో సింగపూర్‌తో దీర్ఘకాలిక సంబంధాలపై వివియన్ బాలకృష్ణన్, రేవంత్ రెడ్డి చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యుత్, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, మూసీ పునరుజ్జీవనం, విద్య, స్కిల్ డెవలప్‌మెంట్, ఐటీ తదితర రంగాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఛాంగీ నగరంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ITE)ని సీఎం బృందం సందర్శించింది.
ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ : అక్కడ శిక్షణ ఇస్తున్న తీరు, కోర్సులు, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం సింగపూర్ ఐటీఈతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ సమక్షంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను ఉపయోగించుకోవడంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ట్రైయినర్లకు శిక్షణ ఇచ్చేలా ఒప్పందం జరిగింది.
సీఎం రేవంత్ ట్వీట్ : సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐటీఈ పదో తరగతి విద్యార్ధుల నుంచి అన్ని వయసుల వారికి జాబ్ రెడీ శిక్షణ ఇస్తోంది. స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్ అనే నినాదంతో వంద కోర్సులకు ఆన్‌లైన్, క్యాంపస్ శిక్షణ ఇస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని సింగపూర్ ఐటీఈని సీఎం కోరారు. ఈనెల 19 వరకు సింగపూర్‌లోనే రాష్ట్ర బృందం పర్యటించనుంది. ఈనెల 20 నుంచి దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల పర్యటన సింగపూర్ విదేశాంగ మంత్రితో ఫలవంతమైన చర్చలతో ప్రారంభమైందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
పెట్టుబడుల వేటలో సీఎం బృందం - రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఇదే