Heavy Rain Alert in Telangana Next Two Days : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు కూడా అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇవాళ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు పేర్కొన్నారు.
అదే విధంగా ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
రేపు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో కురిసే అవకాశాలున్నాయని వివరించారు. మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారి శనివారం(ఈరోజు) ఉదయం 5.30 నిమిషాలకు అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఆంధ్ర తీరం దానికి అనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో విశాఖపట్టణం, గోపాల్పూర్ మధ్య కళింగపట్టణం సమీపంలో ఈరోజు 31 ఆగస్టు అర్ధరాత్రి సమయానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు : ఋతుపవన ద్రోణి ఈరోజు సగటు సముద్రమట్టం నుండి పాకిస్థాన్ తీరం సమీపంలోని ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతంలోని తీవ్ర తుఫాను కేంద్రం నుంచి జలగం బ్రహ్మపురి జగదల్పూర్ కళింగపట్నం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం కేంద్రం వరకు విస్తరించిందని వివరించారు. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి. మీ. వేగంతో వీచే అవకాశాలున్నాయని ఐఎండీ సంచాలకులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు - సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం