Paddy Illegal Transport in Mahabubnagar : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కీలక గుట్టు బయటపడింది. మరాడించి బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి కోట్లు సొమ్ము చేసుకుంటున్న దందా వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన పౌర సరఫరాల శాఖ అక్రమార్కులపై దృష్టిసారించింది. ఏడాదికాలంగా వనపర్తి జిల్లాలో పౌరసరఫరాలశాఖ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు చేస్తున్న దాడుల్లో రూ.120 కోట్లకు పైగా విలువైన ధాన్యం మాయమైనట్లు తెలుస్తోంది.
కోట్లలో అక్రమాలు : తాజాగా వనపర్తి జిల్లా నాచహళ్లీలో రిలిక్ ఇండస్ట్రీస్ బియ్యం మిల్లులో కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం అప్పగించిన ధాన్యంలో సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆ ధాన్యం విలువ సుమారు రూ. 34 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామం గోపాల్‌రెడ్డి ఇండస్ట్రీస్ బియ్యం మిల్లులో జరిపిన దాడుల్లో 2,447 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. వీటి విలువ రూ.7 కోట్ల 92 లక్షలుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
శుక్రవారం ఒక్కరోజే సుమారు రూ. 40 కోట్ల అక్రమాలు బయటపడితే, సెప్టెంబర్ నెలలో వనపర్తి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రైస్ మిల్లులపై జరిగిన దాడుల్లో ఇప్పటికే కోట్ల విలువైన అక్రమాలు వెలుగుచూశాయి. పానగల్ మండలం రేమొద్దులలో అబ్రార్ ఇండస్ట్రీస్‌లో ఐదున్నర కోట్లు విలు చేసే ధాన్యం, పెబ్బేరు మండలం జనుంపల్లి- రంగాపూర్ మధ్యలో ఉన్న సత్య ఇండస్ట్రీస్‌లో 5 కోట్ల 60 లక్షల విలువ చేసే ధాన్యం, మదనాపురం మండలం దంతనూరు శివారులో ఉండే వెంకటేశ్వర ఇండస్ట్రీస్‌లో 8 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. అన్ని మిల్లుల యజమానులపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
జులై నెలలో వనపర్తి మండలంలోని అచ్యూతాపురంలో మహలక్ష్మి ఆగ్రోటెక్ మిల్లులో 10 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం లేనట్లు గుర్తించారు. దాని విలువ సుమారు 31 కోట్లు. గతేడాది డిసెంబర్‌లో పానగల్ మండలంలో పరమేశ్వరి, ఇసాన్ ఆగ్రోటెక్, మీనాక్షి బియ్యం మిల్లులు, వనపర్తిలోని కేదార్‌నాథ్, కొత్తకోట మండలంలోని మిరాశిపల్లి వద్ద ఉండే ఇసాన్ ట్రేడర్స్‌లో అధికారులు సోదాలు నిర్వహించి 31 లక్షల బస్తాలు మాయమైనట్లు తేల్చారు. వీటి విలువ 24 కోట్ల 80 లక్షలు ఉన్నట్లు తెలిపారు.
మొత్తంగా డిసెంబర్ నుంచి జరిగిన దాడుల్లో సుమారు 130 కోట్ల ధాన్యం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో పౌరసరఫరాలశాఖ చేస్తున్న దాడులు అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. దాడులు ఆగవని, అనుమానం ఉన్న ప్రతి మిల్లులో సోదాలు కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. ధాన్యం మాయమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - జనవరి నుంచి సన్న బియ్యం - MINISTER UTTAM ON RATION RICE