Telangana Student Missing in US : అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రమాదాలు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. గత నెలలో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి కనిపించకుండా పోయి ఆ తర్వాత శవమై కనిపించాడు. ఇలా ఇప్పటి వరకు ఈ ఏడాదిలో భారతీయ విద్యార్థులు 25 మంది చనిపోయారు. ఇప్పుడు తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగోలో అదృశ్యమైనట్లు, గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియలేదని అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం : తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి రూపేశ్ చంద్ర చింతకింది మే 2వ తేదీ నుంచి కనిపించటం లేదని కాన్సులేట్ తెలిపింది. ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ విద్యార్థి ఆచూకీ కోసం ప్రవాస భారతీయులు, పోలీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. త్వరలోనే రూపేశ్ చంద్ర జాడ తెలుస్తుందని ఆశిస్తున్నామని షికాగోలోని భారత రాయబారి కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు పోలీసులు కూడా దీనిపై ప్రకటనను విడుదల చేశారు. రూపేశ్ గురించి తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు.
ఈ ఏడాదిలో ఇలాంటి ఘటనలు అనేకం : తెలంగాణకు చెందిన రూపేశ్ ప్రస్తుతం విస్కాన్సిన్లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అతడు అదృశ్యమైనట్లు తెలియగానే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై, కన్నీరు పెట్టుకుంటున్నారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా ఎంబసీలను అభ్యర్థించారు.
2024 ఆరంభం నుంచి అగ్రరాజ్యంలో భారతీయ, భారత సంతతి విద్యార్థులపై ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్న విషయం తెలిసిందే. దాడులు, కిడ్నాప్‌లు వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ఘటనలపై అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా గడ్డపై విదేశీ విద్యార్థుల భద్రతకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చింది.
దుండగుడి కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి.. జైశంకర్ దిగ్భ్రాంతి