Telangana State Income Till February 2024 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలలు ముగిసే నాటికి రాష్ట్ర బడ్జెట్ అంచనాలను 70 శాతం మాత్రమే అధిగమించింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్‌కు (CAG Report Of Telangana) రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఖజానాకు రూ.1,51,947 కోట్ల ఆదాయం సమకూరింది. బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం రూ.2,15,566 కోట్లలో ఇది 70శాతానికి పైగా ఉంది. అందులో పన్నుల రాబడి రూ.1,24,146 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో పన్ను ఆదాయం 81 శాతానికిపైగా చేరుకొంది.
GST Income in Telangana 2024 : జీఎస్టీ ద్వారా రూ.42,441 కోట్లు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,980 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.27,467 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.18,927 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.14,955 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ.7,374 కోట్లు ఖజానాకు చేరాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం కంటే స్వల్పంగా ఎక్కువగా వచ్చింది.
అమ్మకం పన్ను అంచనాలను 70 శాతంలోపే అందుకొంది. పన్నేతర ఆదాయం (Telangana Non Tax Revenue 2024) రూ.22,808 కోట్లు అంచనా వేయగా ఫిబ్రవరి నెలాఖరు వరకు అందులో 91 శాతానికి పైగా రూ.20,845 కోట్లు ఖజానాకు చేరాయి. ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల మొత్తం రూ.41,448 కోట్లు. అన్ని రకాలుగా ఖజానాకు ఫిబ్రవరి నెలాఖరు వరకు వచ్చిన మొత్తం రూ.1,93,428 కోట్లు. బడ్జెట్ అంచనా అయిన 2,59,861 కోట్లలో ఇది 74 శాతానికి పైగా ఉంది.
Telangana State Expenditure : ఖర్చు విషయానికి వస్తే ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రభుత్వం చేసిన వ్యయం మొత్తం రూ.1,87,357 కోట్లు. బడ్జెట్ అంచనా రూ.2,49,209 కోట్లలో ఇది 75 శాతానికిపైగా ఉంది. వడ్డీ చెల్లింపుల కోసం రూ.20,844 కోట్లు, వేతనాల కోసం రూ.35,739 కోట్లు, పింఛన్ల కోసం రూ.15,344 కోట్లు, రాయతీల కోసం రూ.8,248 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రానికి ఫిబ్రవరి నెలలోనే అధికంగా పన్ను ఆదాయం (Telangana Tax Revenue) వచ్చింది. 2023-24లో డిసెంబర్లో పన్నుల ద్వారా రూ.12,609 కోట్లు ఖజానాకు రాగా ఫిబ్రవరిలో ఆ మొత్తాన్ని అధిగమించి ఏకంగా రూ.13,703 కోట్లు సమకూరాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఫిబ్రవరి నెలలో రూ.1,111 కోట్లు వచ్చాయి. కాగా మార్చి 31వ తేదీనా 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనుంది.
ఆదాయం పెరిగినా రెవెన్యూ మిగులు సాధించడంలో రాష్ట్రం విఫలం - కాగ్ రిపోర్టు