Telangana Railway Projects Getting Delayed : దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు రైల్వే నెట్వర్కల్ చాలా వెనుకబడి ఉంది. కాగా సర్వేల పేరుతో రైల్వే శాఖ ఊరింపులకే పరిమితం చేస్తోంది. ప్రతి సంవత్సరం ఆ సర్వే అంటూ ఇటూ దక్షిణ మధ్య రైల్వే అంటూ రైల్వే బోర్డు సంవత్సర సంవత్సరాలుగా సాగదీస్తున్నాయి. ఫలితంగా ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు తగినంత ప్రాధాన్యం లభించడం లేదు. ప్రస్తుతం తుది సర్వే మంజూరైన రైల్వే ప్రాజెక్టులు 30 ఉన్నాయి. అవి కార్యరూపం దాలిస్తే తెలంగాణలో రూ.83,543 కోట్లు రైల్వే పనులు ప్రారంభమవుతాయి.
భద్రాచలం, మేడారం, రామప్ప దేవాలయం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నా జిల్లాలైనా వనపర్తి, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌తోపాటు కొడంగల్, పరిగి, నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ వంటి వెనకబడిన ప్రాంతాలకు నిర్మల్, ఇచ్చోడ వంటి అటవీ ప్రాంతాలకు ఇప్పటివరకు రైల్వే అనుసంధానమే లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో లక్షపైన జనాభా ఉన్న అన్ని పట్టణాలనూ రైలు మార్గంతో అనుసంధామిస్తామంటూ కేంద్రం ప్రకటన చేసింది. కానీ అది ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక కేంద్రం మంజూరు చేసిన ఫైనల్ లొకేషన్ సర్వే ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రాజెక్టుల సంఖ్య పదేళ్లతో పోలీస్తే పెరిగింది. అంతకుముందు పదేళ్లలో రూ.10,912 కోట్ల విలువైన ఐదు ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రాజెక్టులే మంజూరే కాగా నిధుల కేటాయింపు పెరుగుతున్నా రాష్ట్ర అవసరాలతో పోలిస్తే తక్కువే.
- 2010 జూన్లో వికారాబాద్ -కృష్ణా వయా వరంగల్ 122 కి.మీ మేర కొత్త రైలు మార్గం ప్రాజెక్టకు సర్వే మంజూరైంది. ఈ ప్రాజక్టు నిర్మాణానికి రూ.787 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2012 మార్చిలో రైల్వేబోర్డుకు నివేదిక ఇచ్చారు. 2023 సెప్టెంబరు 8న తుది సర్వే మంజూరైంది. అప్పుడు ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.2,196 కోట్లకు చేరింది. తుది సర్వే మంజూరై 9 నెలలు దాటినా పనులు ప్రారంభంకాలేదు.
- శంషాబాద్-విజయవాడ సెమీ హైస్పీడ్ కారిడార్ సర్వేకు రైల్వేబోర్డు గతేడాది ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణమైతే గంటకు 220 కి.మీ.గరిష్ఠ వేగంతో రైళ్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పెట్ (ప్రిలిమినరీ ఇంజినీరింగ్ అండ్ ట్రాఫిక్) సర్వే సంవత్సరకాలంగా జరుగుతోంది. ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్-విజయవాడ వెళ్లడానికి సమయం తక్కువ పడుతుంది.
- కరీంనగర్-హసన్‌పర్తి 62 కి.మీ. కొత్త రైలు మార్గం కోసం సర్వే 2011లో మంజూరైతే దాని నివేదిక 2013లో రైల్వేబోర్డుకు చేరింది. అప్పుడు అంచనా వ్యయం రూ.464 కోట్లు ఇప్పుడు దాని వ్యయం రూ.1,116 కోట్లకు చేరింది.
- దిల్లీ, విజయవాడ వైపు వెళ్లే రైళ్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో ప్రస్తుతం రెండు లైన్లే ఉన్నాయి. 85.48 కి.మీ. మేర మూడో లైను నిర్మిస్తే ప్రయాణికులకు రాకపోకలు సులభమై రైళ్ల వేగం పెరుగుతుంది. ప్రయాణ సమయం తగ్గుతుంది. మూడో లైనుకు 2014లో సర్వే మంజూరైతే 2018లో రైల్వేబోర్డుకు ప్రాథమిక సర్వే నివేదిక వెళ్లింది.
ప్రాథమిక సర్వేలు చేసిన ప్రాజెక్టులకు సంబంధించి తుది సర్వే పూర్తి చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించాలి. బోర్డు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపితే కేంద్ర బడ్జెట్లో రైల్వేశాఖ ఆ ప్రాజెక్టులను చేర్చి నింధులు మంజూరుచేస్తుంది. రాష్ట్రానికి సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వేల్లో కొత్త లైన్లతోపాటు అదనపు లేన్ల మార్గాలు కూడా ఉన్నాయి.
రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజనల్ రింగ్ రైల్ లైన్ను నిర్మించనున్నట్లు కేంద్రం పోయిన ఏటా ప్రకటించింది. ఫైనల్ సర్వే మంజూరు చేసి దానికి రూ.14 కోట్ల నిధులు కేటాయించింది. కానీ ఇప్పటివరకు సర్వే మొదలుకాలేదు. నిధుల్లోంచి పైసా ఖర్చు చేయలేదు. 564 కి.మీ ప్రతిపాదిత రైలు మార్గం ప్రాథమిక వ్యయం రూ.12,408 కోట్లు అంచనా.
లైన్ | ప్రాజెక్టుల సంఖ్య | దూరం (కి.మీ.) | అంచనా వ్యయం (రూ. కోట్లలో) |
కొత్త మార్గాలు | 15 | 2,647 | 50,848 |
డబ్లింగ్ | 8 | 1,451 | 17,862 |
ట్రిప్లింగ్ | 3 | 373 | 4,849 |
క్వాడ్రాప్లింగ్ | 4 | 768 | 9,984 |