TG Phone Tapping Case Updates : రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులే దగ్గరుండి డబ్బు సరఫరా చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. 2022 నవంబర్ 3న జరిగిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అభ్యర్థి కోసం నిబంధనలకు విరుద్ధంగా డబ్బు సరఫరా చేసేందుకు పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఫార్చునర్ వాహనం వినియోగించినట్లు వెల్లడైంది. అప్పట్లో ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారితో పాటు ఓ డీఎస్పీ కీలకంగా వ్యవహరించినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసును పర్యవేక్షిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది.
Money Transported in Munugode Bypoll :ఫార్చునర్ వాహనానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించిన కానిస్టేబుల్ నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించారు. ఆ ఐపీఎస్ అధికారితోపాటు, స్పెషల్ బ్రాంచ్ వ్యవహారాలను పర్యవేక్షించిన డీఎస్పీ ఆదేశాలతోనే తాను ఈ విధంగా వ్యవహరించినట్లు కానిస్టేబుల్ దర్యాప్తు అధికారుల ఎదుట వాంగ్మూలమిచ్చారు. నల్గొండ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన అతను అప్పటి తతంగాన్ని దర్యాప్తు బృందానికి పూసగుచ్చినట్లు వివరించారని సమాచారం. విచారణ చేస్తున్న సమయంలో మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం తమ వాంగ్మూలాల్లో ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.
ఎన్నికల సమయంలో దాదాపు 7 రోజుల పాటు డబ్బు తరలించారని దర్యాప్తు బృందం ఆధారాలను సేకరించారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో నల్గొండ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేశానని ఆ కానిస్టేబుల్ వాంగ్మూలంలో తెలిపారు. ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ తనను ఆయన వెంట తీసుకెళ్లారని చెప్పారు. 2022 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకు వరుసగా రాత్రి వేళల్లో ఫార్చునర్ వాహనానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించానని వెల్లడించారు.
Phone Tapping Case Investigation Updates : అదే వాహనంలో బీఆర్ఎస్(టీఆర్ఎస్) అభ్యర్థికి డబ్బు తరలించారని కానిస్టేబుల్ తెలియజేశారు. అక్టోబర్ 31న బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి పాల్గొన్నారని, ఆ సభలో తమ డీఎస్పీ ఓ పోలీసు అధికారిని తనకు చూపించారన్నారు. ఆయన అదనపు ఎస్పీ అని కేసీఆర్‌తో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారని వివరించారు. అదనపు ఎస్పీ ఆదేశాల మేరకే మనం ఈ డబ్బు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ పోలీసు అధికారి అదనపు ఎస్పీ భుజంగరావు అని తనకు తెలిసిందని కానిస్టేబుల్ వాంగ్మూలంలో పేర్కొన్నారు.
కీలకంగా వ్యవహరించిన ఓ ఉన్నతాధికారి : మరోవైపు అప్పట్లో పోలీసు శాఖలో అత్యున్నత స్థాయిలో కీలకంగా వ్యవహరించిన ఓ సీనియర్ ఉన్నతాధికారి ఒకరు మౌఖికంగా నగదు తరలింపునకు ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది. దీంతో సదరు ఐపీఎస్ అధికారి తలొగ్గారని పోలీసు శాఖలో ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసు - భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్లు కొట్టివేత