Lok Sabha Election Campaign in Telangana : సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన పాగ వేసేందుకు తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంతో బీజేపీ ప్రచార జోరు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో రెండంకెల సీట్లు కైవసం చేసుకోవాలనే ధ్యేయంతో వ్యూహాలను అమలు చేస్తోంది. అందుకు తగ్గట్టు బీజేపీ స్టార్ క్యాంపయినర్లుగా నియమితులైన వారిని రాష్ట్రానికి రప్పించి ప్రచారం చేయిస్తోంది.
వీరితో పాటు రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, రాజాసింగ్, మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డిలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. హైదరాబాద్‌లో ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత ఫిర్యాదు చేశారు. గోవధను ప్రోత్సహించేలా ప్రసంగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు.
BJP Leaders Election Campaign : నల్గొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్ ర్యాలీలో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు పాల్గొన్నారు. నల్గొండ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండిసంజయ్ నియోజకవర్గ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కరీంనగర్‌కు పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని బండి డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ప్రచార జోరును పెంచారు.
నందిపేట మండలం ఖుద్వాన్ పూర్‌లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అర్వింద్ పరిశీలించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా రైతుల పరిస్థితి మారలేదని మండిపడ్డారు. జహీరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ నామినేష్ ర్యాలీలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పాల్గొన్నారు. తెలంగాణను ఇన్నాళ్లూ అవినీతి పార్టీలు దోచుకున్నాయని ఆరోపించిన ఆయన రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
BRS Candidates Election Campaign : సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే తనను మళ్లీ గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లా మల్యాల రోడ్ షోలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీకి నిధులు మంజూరు చేసిన ఘనత బోయినపల్లి వినోద్ కుమార్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. భువనగిరిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.