Drugs Gang Targeted Students in Hyderabad : రాష్ట్రంలో పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నప్పటికీ మాదక ద్రవ్యాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. విదేశాల్లో దొరికే ఓషన్ గ్రోన్ డ్రగ్ హైదరాబాద్‌కు పాకింది. స్మగ్లర్లతో చేతులు కలిపి ఒక్క డోస్‌తో కిక్కు ఎక్కించే ఓజీ, ఎల్ఎస్డీ బ్లాట్స్‌ను సరఫరా చేస్తున్న ముఠా దందాను టీజీ-న్యాబ్ పోలీసులు చేధించారు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అక్రమ్, ప్రణయ్, రోహన్ ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడి ఓజీ, ఎల్ఎస్డీ బ్లాట్స్‌ను విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు.
విద్యార్థులే లక్ష్యంగా ఆరు నెలలుగా దందా : ఓ స్మగ్లర్‌తో చేతులు కలిపి విదేశాల నుంచి తక్కువ ధరకు తెప్పించి విద్యార్థులకు గ్రాముకు రూ.4 వేల చొప్పున అమ్ముతున్నారు. సంపన్న వర్గాల పిల్లలు, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులే లక్ష్యంగా ఆరు నెలలుగా దందా సాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. షాద్‌నగర్‌లోని ప్రముఖ విద్యాసంస్థలో ఎక్కువ మంది విద్యార్ధులు ఓజీకి అలవాటు పడినట్టు టీజీ న్యాబ్ పోలీసులు గుర్తించారు. కార్ఖానా పోలీసుల సహకారంతో మత్తు ముఠా కదలికలను గమనించి అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులతోపాటు వినియోగదారులనూ అరెస్టు చేశారు.
తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ : షాద్‌నగర్ విద్యాసంస్థలో చదువుతున్న 20 మంది విద్యార్థులు ఈ ముఠా నుంచి ఓజీ, ఎల్ఎస్డీ బ్లాట్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విదేశాల్లో లభించే ఓజీని హైదరాబాద్ చేరుస్తున్న ప్రధాన సూత్రధారి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మాదకద్రవ్యాల కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని టీజీ-న్యాబ్ పోలీసులు కోరారు. క్వింటాల్ కంటే ఎక్కువ ఉండే గంజాయి సమాచారం ఇస్తే 2 లక్షల రూపాయలు రివార్డు ఇస్తామని అధికారులు తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు.
'యువత డ్రగ్స్‌ను తీసుకుంటున్నారు. యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మత్తు ముఠా కదలికలను గమనించి కేసును ఛేదించాం. డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మంది వినియోగదారులను గుర్తించాం. వీళ్లందరూ 30 ఏళ్ల లోపు వాళ్లే'- రష్మి పెరుమాళ్, ఉత్తర మండలం డీసీపీ
బెంగళూరు నుంచి ట్రావెల్స్ డ్రైవర్ల ద్వారా డ్రగ్స్ రవాణా - మాదాపూర్‌లో ఐదుగురు నిందితుల అరెస్ట్