Rythu Bharosa Workshop in Khammam District : రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, ఇతర అన్ని వర్గాల సలహాలు, సూచనలు రైతు భరోసా పథకం అమలుపై స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా తొలి కార్యశాల నిర్వహించింది. విధివిధానాల అమలుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్లో అభిప్రాయాలు సేకరించారు.
ఈ సమావేశంలో మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 500 మంది రైతులు హాజరయ్యారు. రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ రంగాలకు చెందిన బాధ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతులు, రైతు సంఘాలు, అన్ని వర్గాల సూచనలు, ఆలోచనలు సేకరించిన తర్వాతే రైతు భరోసా పథకం విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించి, శాసనసభలో ఒకరోజు చర్చ పెట్టిన తర్వాతే అంతిమంగా నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. పంట పండించేందుకు రైతుకు భరోసా కల్పించేందుకు రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీ మేరకు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు స్వీకరించి రైతు భరోసా పథకం అమలు చేయాలన్న ధృడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది" అని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సాగు చేసే నిజమైన ప్రతి రైతుకు భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. గతంలో జరిగిన లోపాలు, ఆర్థిక నష్టం ప్రజల కళ్లముందే ఉన్నాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అలా కాకుండా కష్టపడి పంటలు సాగు చేసే చిన్న సన్నకారు రైతులకు చేయూతనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.
నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ప్రజలపై రుద్దం : గత ప్రభుత్వ హయాంలో ఏ ప్రభుత్వ పథకం ప్రారంభించినా ప్రజల భాగస్వామ్యం లేకుండా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఏనాడు ప్రజల అభిప్రాయాలు స్వీకరించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. కేవలం నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకుని వాటిని ఆనాటి ప్రభుత్వం ప్రజలపై రుద్దిందని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి చర్యలకు ఎంతమాత్రం తావులేదని తెలిపారు. శాసనసభ సమావేశాల్లోనే విధివిధానాలను కొలిక్కి తీసుకొచ్చి అమలు చేస్తామని స్పష్టం చేశారు.
25 రోజులు - రూ.40 వేల కోట్లు - ఆగస్టులోగా రుణ సేకరణకు సర్కార్ ముమ్మర కసరత్తు! - Farmers loan waiver