Telangana Lok Sabha Election Counting Arrangements : రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. మే 13న జరిగిన ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో 66.3శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2 కోట్ల 20 లక్షల 24 వేల 806 ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో పోస్టల్ బ్యాలెట్లు 2,18,000 కాగా, మిగతావి ఈవీఎంలలో నమోదైనవి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 120 హాళ్లలో 1,855 టేబుళ్లు సిద్ధం చేశారు.
చేవెళ్ల, మల్కాజిగిరి పరిధిలో రెండేసి టేబుళ్లు : ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాలు ఏర్పాటు చేయగా, మహేశ్వరంలో రెండు హాళ్లు సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 19 హాళ్లలో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి ఒక టేబుల్ ఏర్పాటు చేయగా, చేవెళ్ల, మల్కాజిగిరిలో రెండేసి సిద్ధం చేశారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు టేబుళ్లు, సిబ్బంది వేర్వేరుగా ఉన్నందున, లెక్కింపు సమాంతరంగా ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 వరకు పూర్తవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
"సాధారణ ప్రక్రియ ఏమిటంటే, ఒకే హాల్లో పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం రెండూ కౌంటింగ్ ఉంటే మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించటం జరుగుతుంది. దానికి అర్ధగంట తరవాత ఈవీఎం స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర సికింద్రాబాద్ ఉప ఎన్నికల కౌంట్ మినహా అన్నింటా రెండూ వేరువేరుగా కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి కావున ఏక కాలంలో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది."-వికాస్ రాజ్, సీఈఓ
10 Thousand Personnel in Election Counting : ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు 18 నుంచి 24 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని అంచనా. అత్యధికంగా చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 24 రౌండ్లు. అతితక్కువగా ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో పూర్తికానుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి 49 మంది పరిశీలకులు వచ్చారు. వారితోపాటు 2,414 మంది సూక్ష్మ పరిశీలకులు ఉంటారు.
మొత్తం 10 వేల మంది సిబ్బంది కౌంటింగులో పాల్గొంటారని, ఇప్పటికే మూడు విడతల శిక్షణ పూర్తయిందని సీఈఓ తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్, మద్యం దుకాణాల బంద్‌కు ఉత్తర్వులు ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంటు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఫలితం కూడా మంగళవారం తేలనుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ఉంటుంది.
'64.2 కోట్ల ఓట్లతో భారత్ ప్రపంచ రికార్డు'- లెక్క పక్కాగా ఉంటుందన్న CEC - lok sabha election 2024