Legislative Assembly Adjourned : శాసనసభలో విపక్ష సభ్యుల నినాదాల మధ్య సభ రేపటికి వాయిదా పడింది. సభా మర్యాదలు దెబ్బతీసేలా సభ్యులు వ్యవహరిస్తున్నారని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సభలో మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో సభ్యుల వద్ద ప్లకార్డులను తీసుకురావాలని మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశించారు. ప్లకార్డులను మార్షల్స్‌కు ఇస్తే మాట్లాడే అవకాశమిస్తామని స్పీకర్ సభ్యులకు సూచించారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య సభను రేపటికి వాయిదా వేశారు.
సభా మర్యాదకు భంగం కలిగించడం సరికాదు : శాసనసభలో బీఆర్ఎస్ నేతల తీరును ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు ఖండించారు. పర్యాటక అంశంపై మంత్రి మాట్లాడుతుంటే అడ్డుకున్నారని మండిపడ్డారు. సభా సంప్రదాయాలను విపక్షసభ్యులు పట్టించుకోవట్లేదని ఆక్షేపించారు. సభా మర్యాదకు భంగం కలిగించడం సరికాదని భట్టి విక్రమార్క హితవుపలికారు. సభాపతిపై విపక్ష సభ్యులకు గౌరవం ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సభా సమయం వృథా చేయడానికి ప్రయత్నిస్తున్నారు : మరోవైపు శాసనసభలో బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించడాన్ని మంత్రి శ్రీధర్‌బాబు తప్పుపట్టారు. సభా సంప్రదాయాలను విపక్షాలు గౌరవించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఆదేశాలను సభ్యులు పక్కనపెట్టడం సరికాదన్నారు. విపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంలో ప్రభుత్వం జవాబిస్తుందన్నారు. బీఏసీ భేటీలో విపక్షాలు అభిప్రాయాలు తీసుకున్నారని తెలిపారు. విపక్షసభ్యులు సభా సమయం వృథా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ముగిసిన బీఏసీ సమావేశం : మరోవైపు స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. ఎన్నిరోజులు సభ నడుపుతారో చెప్పడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. బీఏసీ లేకుండానే రెండు బిల్లులు చర్చపెట్టడం సంప్రదాయ విరుద్ధమన్నారు. సభ కనీసం 15 రోజులు నడపాలని కోరామని వెల్లడించారు. 3,4 రోజులు సభ నడుపుతామని ప్రభుత్వం చెబుతోందని హరీశ్‌రావు తెలిపారు. టీ షర్టులతో వస్తే ఎందుకు ఆపారని నిలదీశామన్నారు. టీష్ర్ట్లతో పార్లమెంట్‌కు రాహుల్ వెళ్లట్లేదా అని నిలదీశారు.
బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్, అసెంబ్లీ పనిదినాలపై నిర్ణయం తీసుకోకుండానే వాయిదా
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ - రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్