Telangana Irrigation Budget 2024 : వచ్చే తెలంగాణ బడ్జెట్‌లో (2024-25) సాగునీటి రంగానికి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించక తప్పని పరిస్థితి. ఈ మేరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకొన్న రుణాలకు అసలు, వడ్డీ చెల్లించడానికే రూ.16,000 కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ ఆర్థికశాఖకు నివేదించనుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడానికి, పెండింగ్ బిల్లులు, భూసేకరణ, పునరావాసం ఇలా అన్నింటికీ కలిపి మరో రూ.25,000 కోట్లు అవసరం కానున్నాయి. ఈ సొమ్ములిచ్చినా ఇవ్వకున్నా తీసుకొన్న రుణాలకు అసలు, వడ్డీ చెల్లించేందుకు మాత్రం తప్పనిసరిగా నిధులు కేటాయించాల్సి ఉంది. ఎత్తిపోతల విద్యుత్ బకాయిల బిల్లులకు చెల్లించాలంటే డబ్బులు కావాల్సిందే.
తక్కువ నిధులతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే పనులపై దృష్టి : రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులపై (Telangana Budget 2024-2025) సర్కార్ కసరత్తు చేపట్టింది. ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులు రెండురోజులుగా శాఖల వారీగా మంత్రులు, అధికారులతో బడ్జెట్ అవసరాలపై చర్చలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాగునీటి రంగానికి కేటాయించాల్సిన బడ్జెట్‌పై కసరత్తు జరగనుంది.
నీటి పారుదల శాఖకు భారీ బడ్జెట్ - రూ.40 వేల కోట్లతో ప్రతిపాదనలు!
Telangana Govt Exercise Budget 2024 : ఈక్రమంలో నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ల నుంచి సర్కార్ బడ్జెట్ (Irrigation Budget) ప్రతిపాదనలు ఆహ్వానించింది. అన్ని ప్రాజెక్టుల ఇంజినీర్లూ కలిపి సుమారు రూ.50,000 కోట్ల వరకు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీటిని ఇచ్చే పనులకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం సూచించడంతో, దీనికి తగ్గట్లుగా మార్పులు చేసి మళ్లీ ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిసింది.
వివిధ ప్రాజెక్టుల అవసరాలు ఇవీ : రానున్న బడ్జెట్‌లో పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకే రూ.31,800 కోట్లు అవసరమని ప్రతిపాదించినట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్ ద్వారా ఈ రెండు ప్రాజెక్టులకు తీసుకొన్న రుణాలకు అసలు, వడ్డీ 2024-25వ సంవత్సరంలో చెల్లించడానికే రూ.12,500 కోట్లు కోరినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా బ్యాంకులు, ఆర్‌ఈసీ తదితర సంస్థలన్నీ కలిపి రూ.97,449.16 కోట్ల రుణాన్ని మంజూరు చేయగా, రూ.79,287 కోట్లు తీసుకొని ఖర్చు చేశారు.
ఈ మొత్తాన్ని పది సంవత్సరాల్లో చెల్లించాలి. ప్రతినెలా అసలు, వడ్డీ కింద సర్కార్ చెల్లించేలా గ్యారెంటీ ఇచ్చింది. కాబట్టి దీనికి రూ.12,500 కోట్లు అవసరమని కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదించారు. మరోవైపు మంజూరై ఇంకా తీసుకోవాల్సిన రుణానికి ప్రతినెలా మార్జిన్‌మనీ చెల్లించాలని అధికారులు వివరించారు. దీంతోపాటు భూసేకరణ తదితరాలకు రూ.10,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఇప్పటివరకు పెట్టిన ఖర్చుపోను మరో రూ.20,000 కోట్లకు పైగా వ్యయం చేస్తేనే పూర్తవుతుందని ఈ ప్రాజెక్టు ఇంజినీర్లు ప్రభుత్వానికి తెలిపారు. ఈ నిధులను పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ నుంచి వెచ్చించాల్సిందేనని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.9,300 కోట్లు కేటాయించాలని వారు కోరారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు రూ.3,800 కోట్లు కావాలని అన్నారు.
2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు షురూ చేసిన ప్రభుత్వం
Telangana Budget 2024-25 : తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సీతారామ ఎత్తిపోతల, కంతనపల్లి, దేవాదుల, శ్రీరాంసాగర్ వరద కాలువ పథకానికి నీటిపారుదలశాఖ రుణాలు తీసుకొంది. ఈ కార్పొరేషన్ ద్వారా రూ.20,481 కోట్ల రుణం మంజూరైంది. అందులో రూ.17,490 కోట్లు ఖర్చు చేశారు. దీని అసలు, వడ్డీ తిరిగి చెల్లించడానికి రూ.3,212 కోట్లు కావాలి. నాబార్డు నుంచి చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.1,613 కోట్లు రుణం తీసుకొన్నారు.
ఇలా మొత్తం నీటిపారుదల శాఖకు రూ.1,17,931 కోట్ల రుణం మంజూరైంది. అందులో రూ.96,778 కోట్లు నీటిపారుదల శాఖ తీసుకొని ఖర్చు చేసింది. ఈ రుణానికి అసలు, వడ్డీ తిరిగి చెల్లించడానికి వచ్చే బడ్జెట్‌లో రూ.16,000 కోట్లు కేటాయించాలి. ప్రాజెక్టుల వారీగా పనులు పూర్తయ్యేందుకు చీఫ్ ఇంజినీర్లంతా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మంచిర్యాల జిల్లాలోని వార్ధా, చెన్నూరు ఎత్తిపోతలకు రూ.650 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.950 కోట్లు, వనపర్తి జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.480 కోట్లు కావాలని అధికారులు అడిగారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో (Deputy CM Bhatti Vikramarka) సమావేశం తర్వాత సాగునీటి రంగానికి కేటాయింపులు ఎంత అన్నదానిపై మరింత స్పష్టత రానుంది.
రాష్ట్ర బడ్జెట్ 2024-25పై ఉత్కంఠ - ఓటాన్ అకౌంట్‌కు వెళతారా? పూర్తి బడ్జెట్ పెడతారా?
ఆశల పల్లకిలో కొత్త బడ్జెట్ - ఆర్థిక అవరోధాలను అధిగమించడం ఎలా?