Modi Budget Allocations For Telangana Railway Projects : ఏ దేశ అభివృద్ధిలోనైనా రవాణా అత్యంత కీలకం. తక్కువ ఖర్చుతో ప్రయాణాలకు, వస్తు రవాణాకు రైల్వే ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ, తెలంగాణ ప్రాంతంలో పదేళ్లలో రైల్వేలో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే. రైల్వే నెట్‌వర్క్ విషయంలో అత్యంత వెనుకబడిన మన రాష్ట్రానికి బడ్జెట్‌లో తక్కువ నిధులే వస్తున్నాయి.
రాష్ట్రానికి ఇప్పటివరకూ 30 రైల్వే ప్రాజెక్టులు మంజూరైనా అవి కార్యరూపం దాల్చాలంటే కనీసం రూ.85 వేల కోట్లు అవసరమని అంచనా. కానీ, గత సంవత్సరం బడ్జెట్‌లో తెలంగాణకు రూ.4,418 కోట్లే కేటాయించారు. మంగళవారం రోజున పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండటంతో బడ్జెట్ కేటాయింపులపై భారీ అంచనాలు ఉన్నాయి.
తుది సర్వేల్లో తీవ్ర జాప్యం తెలంగాణలో ప్రస్తుతం అమృత్ భారత్ కింద 21 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నారు. ఇందుకోసం భారీగా నిధులు అవసరం. మొదట లింగంపల్లిని హబ్‌గా చేయాలని భావించినా, నిధుల లోటుతో ఆ ప్రతిపాదన మూలనపడింది. ఇక కాజీపేటలో వ్యాగన్ల ఉత్పత్తి యూనిట్‌కు నిధులు ఇవ్వాల్సి ఉంది.
నాగ్‌పుర్, ముంబయి మార్గాల్లో హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అందుకు రైల్వే ట్రాక్‌ను అభివృద్ధి చేయాలి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆయా ప్రాజెక్టుల తుది సర్వేల్లో తీవ్రమైన జాప్యం నెలకొంది. కొన్ని సర్వేల డీపీఆర్‌లు రైల్వేబోర్డుకు వెళ్తున్నప్పటికీ వాటికి మోక్షం లభించడం లేదు. రైల్వేబోర్డు అనుమతిస్తేనే, కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖ ఆయా ప్రాజెక్టులను చేరుస్తుంది.
ఎప్పుడో హామీ ఇచ్చారు - ఎప్పుడు నెరవేరేనో?
- తెలంగాణలో లక్షకుపైగా జనాభా ఉన్న పట్టణాలను రైలుమార్గంతో అనుసంధానిస్తామంటూ గంతంలో కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందుతో పోల్చితే తుది లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్) పూర్తయిన ప్రాజెక్టుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఇప్పటికీ వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నారాయణపేట వంటి జిల్లా కేంద్రాలకు రైలు మార్గం లేదు. గత పదేళ్లలో రూ.10,912 కోట్ల విలువైన ఐదు ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రాజెక్టులు మాత్రమే మంజూరయ్యాయి. తెలంగాణ అవసరాలతో పోల్చితే ఇది చాలా తక్కువ.
- కొడంగల్ మీదుగా వికారాబాద్ - కృష్ణా మార్గంలో 122 కి.మీ. కొత్త రైలుమార్గానికి సంబంధించి 2010లోనే సర్వే పూర్తయింది. రూ.787 కోట్లు అవసరమని అంచనా వేశారు. తెలంగాణ నుంచి గోవా వెళ్లేందుకు ఇది దగ్గరి దారి. రైల్వే బోర్డుకు 2012లో నివేదిక ఇవ్వగా, 2023 సెప్టెంబరులో ఎఫ్‌ఎల్‌ఎస్‌కు అనుమతులు వచ్చాయి. ఈ పదేళ్లలో అంచనా విలువ సుమారు రూ.2,196 కోట్లకు పెరిగింది.
- శంషాబాద్ - విజయవాడ సెమీ హైస్పీడ్ కారిడార్ సర్వేకు రైల్వే బోర్డు గత సంవత్సరం ఆమోదం తెలిపింది. ఈ మార్గంలో గంటకు 220 కి.మీ గరిష్ఠ వేగంతో రైళ్లు ప్రయాణించే కనిపిస్తున్నాయి. ఇంకా ప్రాథమిక ఇంజినీరింగ్, ట్రాఫిక్ సర్వే జరుగుతుంది.
- కరీంనగర్ - హసన్‌పర్తి మధ్య 62 కి.మీ కొత్త రైలుమార్గం సర్వే నివేదిక 2013లో రైల్వేబోర్డుకు పంపించారు. అప్పట్లో దాని అంచనా వ్యయం రూ.464 కోట్లు. ఇప్పుడు రూ.1,116 కోట్లకు చేరింది.
- సికింద్రాబాద్ - కాజీపేట మార్గంలో ప్రస్తుతం రెండులైన్లు ఉన్నాయి. 85.48 కి.మీ. పొడవున మూడోలైను నిర్మాణం కోసం 2014లో సర్వే పూర్తయితే 2018లో ప్రాథమిక సర్వే నివేదిక తయారైనా ఉలుకు లేదు. బీబీనగర్ - గుంటూరు డబ్లింగ్‌కు నిధులు కేటాయించలేదు.
- ఎంఎంటీఎస్ - 2 విస్తరణలో భాగంగా ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు నిర్మాణ వ్యయం పూర్తిగా భరిస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది.
- ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుబంధంగా 564 కి.మీ. రీజినల్ రింగ్ రైల్ లైన్ నిర్మించనున్నట్లు కేంద్రం గత సంవత్సరం ప్రకటించింది. రూ.14 కోట్లు మంజూరు చేసినా, ఇంకా సర్వే మొదలవలేదు. ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.12,408 కోట్లుగా పేర్కొన్నారు.