TG High Court Verdict on Protection of Lakes : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కట్టమైసమ్మ చెరువు పరిరక్షణకు తీసుకున్న ఏర్పాట్లపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కట్టమైసమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఏమైనా సంస్థల సహకారం తీసుకుని వాకింగ్ ట్రాక్ నిర్మాణం చెరువు చుట్టూ రక్షణకు ఏర్పాట్లు చేసేలా ప్రయత్నించాలని తెలిపింది.
చెరువులో చెత్త నింపకుండా చర్యలు తీసుకోవాలని, వీటన్నింటిపై స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామంలోని కట్టమైసమ్మ రక్షణకు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది మల్లేశ్వరరావు 2020లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జై అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చెరువు రక్షణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై జీహెచ్ఎంసీ నివేదిక సమర్పించింది.
చెరువు అభివృద్ధిపై తీసుకున్న చర్యలపై స్థాయీ నివేదిక సమర్పించాల్సిందే : చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని గుర్తించినట్లు పేర్కొంది. చెరువులో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని ధ్రువీకరించింది. చెరువు చుట్టూ లింక్ చైన్ మెస్‌తో కంచె ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కార్పొరేట్ కంపెనీల బాధ్యత కింద వాకింగ్ ట్రాక్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. వీటన్నింటిని జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం చెరువు రక్షణకు ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేసింది. చెరువు అభివృద్ధిపై తీసుకున్న చర్యలపై స్థాయీ నివేదికను మూడు నెలల్లో హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని ఆదేశించింది.
HC Verdict on Encroachment in Telangana : గతవారం అక్రమ నిర్మాణాలపై విచారించిన ధర్మాసనం కీలక సూచనలు చేసింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి అక్రమ నిర్మాణాలు ముప్పుగా మారుతాయని, వాటి తొలగింపుపై అధికారులు జాప్యం చేసినా ఉదాసీనంగా వ్యవహరించినా చట్ట ఉల్లంఘనలను ప్రోత్సహించినట్లవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించకుండా పౌరులు కోర్టుకు వస్తేనే అధికారులు మేల్కొని చర్యలు ప్రారంభిస్తున్నారని వ్యాఖ్యానించింది.
అక్రమ నిర్మాణాలపై పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశాన్ని జీహెచ్ఎంసీ, టీఎస్ బిపాస్ చట్టాలు కల్పిస్తున్నాయని, ఇలాంటి ఫిర్యాదులను అధికారులు ప్రోత్సహించడంతో పాటు వారి ఉనికిని రహస్యంగా ఉంచుతూ రివార్డులు అందజేయాలనంది. అందువల్ల అక్రమ నిర్మాణాలపై పౌరులు ఎవరైనా ఫిర్యాదు దాఖలు చేయవచ్చని పేర్కొంది.