Telangana HC Verdict On MLCs Appointments : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వానికి చుక్కెదురైంది. కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకాలపై తెలంగాణ సర్కార్ ఇచ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని న్యాయస్థానం సూచించింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం తెలిపింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నేరుగా తిరస్కరించకుండా తిరిగి పంపించాల్సిందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా (Governor Quota MLCs) నియమించడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ అనంతరం హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.
సెల్లార్ నిర్మాణాలపై ముందస్తు అనుమతులు తీసుకోవాలి - స్పష్టం చేసిన హైకోర్టు
HighCourt Dismissed Governor Quota MLCs Appointments : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకానికి తమిళిసై సౌందర రాజన్ అంగీకరించారు. వీరిద్దరి పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేయగా, ఆమె ఆమోదం తెలిపారు. అయితే మరోవైపు గత బీఆర్ఎస్ సర్కార్ 2023 జులై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ గవర్నర్‌కు పంపింది. 2023 సెప్టెంబర్ 25న ఈ ఇద్దరి పేర్లను తమిళిసై తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని తమిళిసై అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.
ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్ వేశారు. గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌లను తెలంగాణ సర్కార్ సిఫార్సు చేసి గవర్నర్ వద్దకు పంపింది.
పోలీసులు ఉన్నది ప్రజల కోసం - వారిని భయాందోళనలకు గురి చేయడానికి కాదు : హైకోర్టు
రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సును అనుసరించి వారి పేర్లను తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా లభించడంతో వారి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే దీన్ని సవాల్ చేస్తూ కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ మరోసారి హైకోర్టును (Telangana HighCourt) ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై నిర్ణయం వెలువడే వరకూ ఈ నియామకాలు ఆపాలని పిటిషన్‌లో తెలిపారు. దీనిపై పిటిషనర్లు, తెలంగాణ సర్కార్, గవర్నర్ కార్యాలయం తరఫున న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేస్తూ నేడు తీర్పు ఇచ్చింది.
ఫంక్షన్ హాళ్లలో శబ్ధ నియంత్రణపై తీసుకుంటున్న చర్యలు ఏంటి? : హైకోర్టు
విద్యార్థిని ఫీజు రీయింబర్స్మెంట్ విషయంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు