Fire Department Development In Telangana : అగ్నిమాపక శాఖను మరింత పటిష్ఠం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. విస్తరణ, ఆధునీకీకరణ పథకం కింద రాష్ట్ర అగ్నిమాపక శాఖకు గతంలో ఎన్నడూ లేని విధంగా 15వ ఆర్థిక సంఘం రూ. 190.14 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ. 47.53 కోట్ల రూపాయలు ఇవ్వనుంది. ఈ మేరకు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి కేంద్ర అగ్నిమాపక పౌరరక్షణ, హోంగార్డు విభాగం డీజీ వివేక్ శ్రీవాత్సవతో ఎమ్‌వోయూ కుదుర్చుకున్నారు.
Central Funds To Fire Department : ముందుగా కేంద్రం రూ.142.61 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర సర్కార్ వాటా నిధులిచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిధులతో 18 నూతన అగ్నిమాపక కేంద్రాల నిర్మాణం, ఉపకరణాలు అందుబాటులోకి రానున్నాయి. రూ. 87.57 కోట్లతో రెండు హైడ్రాలిక్ ఫ్లాట్‌ఫాంలు, టర్నబుల్ నిచ్చెన, మంటలు అదుపు చేసేందుకు ఉపయోగించే రోబో కొనుగోలు చేయనున్నారు. అగ్నిమాపక వాహనాల కోసం రూ.87. 67 కోట్లు, ఫైర్ స్టేషన్ల ఆధునీకీకరణకు రూ. 9. 50 కోట్లు వినియోగించనున్నారు. సిమ్యులేషన్ శిక్షణ కేంద్రం రూ. 9.53 కోట్లు, 11 అగ్నిమాక కేంద్రాలు, రెండు జిల్లా అగ్నిమాపక అధికారుల భవనాల నిర్మాణం చేపట్టనున్నారు.
తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో 39 ఫైర్ స్టేషన్‌లు, 1,841 ఫైర్ సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో 146 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా, సిబ్బంది సంఖ్య 2,734కు పెంచారు. 15 ఫైర్ ఔట్‌పోస్టుల్లో 256 మంది పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు రూ.32.12 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది.
నూతనంగా జూబ్లీహిల్స్, అంబర్‌పేట్, చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, అలంపూర్, నారాయణపేట్, జనగాం తదితర ప్రాంతాల్లో 18 కొత్త అగ్ని మాపక కేంద్రాలు ప్రారంభించారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో వీటికి భవనాల నిర్మాణంతోపాటు అగ్నిమాపక శాఖను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు మార్గం సుగమమైంది. అగ్నిమాపక శాఖను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మరింత వేగంగా, మెరుగైన సేవలందిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
వేసవిలో అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : డీఎఫ్‌వో - FIRE OFFICER SRINIVAS INTERVIEW