Govt Likely to Make Announcement On Group1 Exam : టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడం, వారికి ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఈ నెల 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను కొద్దిరోజులు వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై క్లారిటీ ఇచ్చే అవకాశం : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్ధులు, ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, అపోహలపై నేడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం రాత్రి మంత్రుల నివాస ప్రాంగణంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ఇంట్లో మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన తరువాత మంత్రులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జీ. ఓ 29, జీ.ఓ 55లపై చర్చించిన మంత్రులు అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.
Govt Focus On Group1 Exam : రాష్ట్ర గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థులు చేస్తున్న ఆందోళన, వాదనలపై సర్కార్ దృష్టి సారించింది. ప్రభుత్వం ఇచ్చిన జీ.ఓ 29 వల్ల నష్టం జరుగుతుందని రిజర్లేషన్లు కోల్పోతామని కొందరు అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై. గ్రూప్-1 అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్ధులు న్యాయస్థానంలో తీర్పులు వెలువడే వరకు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వారికి మద్దతుగా నిలువడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.
మంత్రి పొన్నం ఇంట్లో పలువురు మంత్రల భేటీ : పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చొరవతో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో గ్రూప్-1 అభ్యర్ధుల సమస్యలపై ప్రత్యేకంగా మంత్రులు, అధికారులు, న్యాయ నిపుణులు సమావేశమయ్యారు. ప్రధానంగా అభ్యర్ధులు తెరపైకి తెస్తున్న జీ.ఓ 29, జీ.ఓ 55లపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ టీజీపీఎస్సీ అధికారులు, న్యాయ నిపుణులు, వివిధ శాఖల అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. అభ్యర్థులు ఆరోపిస్తున్నట్లు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తే భవిష్యత్తులో న్యాయ సమస్యలు ఏవైనా వస్తాయా అన్న కోణంలో పరిశీలిన చేసినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలతో పాటు అభ్యర్ధులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను దృష్టిలో ఉంచుకుని లోతైన చర్చ జరిగింది. ఈ చర్చలకు సంబంధించిన పూర్తి సారాంశాన్ని గ్రూప్-1 అభ్యర్థుల అనుమానాలు, అపోహలను నివృత్తి చేసేలా సర్కార్ స్పష్టత ఇవ్వనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ మీడియా ముందుకు వచ్చి మంత్రులు చెప్పడం లేదా స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
మీ అన్నగా నేనున్నాను - ఆందోళన విరమించి మెయిన్స్‌కు సిద్ధంకండి : రేవంత్ రెడ్డి
గ్రూప్-1 మెయిన్స్‌కు దగ్గరపడుతోన్న సమయం - పరీక్షల రద్దుకు అభ్యర్థుల ఆందోళన