Irrigation Projects in Telangana : నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం, ఏటా కొత్తగా 6లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించాలని భావిస్తోంది. అందుకోసం ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది 12 ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో ఎంచుకొంది. గోదావరి బేసిన్‌లో 6, కృష్ణా బేసిన్ 6 ప్రాజెక్టులు ఉన్నాయి.
గోదావరి బేసిన్ ప్రాజెక్టులు : మొదటి ఏడాది 75 శాతానికి పైగా పనులు పూర్తయి కొద్దిపాటి వ్యయంతో మిగితావి పూర్తిచేసి 6లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తోంది. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలను పూర్తిచేయడం ద్వారా 45,738 ఎకరాలకు సాగునీరు అందనుంది. అందుకు 184 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొడికుంటవాగు ప్రాజెక్టు పనుల పూర్తికి 163 కోట్లు అవసరం కానున్నాయి. చనాకా-కొరాటా సహా లోయర్ పెన్ గంగ ప్రాజెక్టులపై 147కోట్ల ఖర్చు చేసి 50వేల ఎకరాలకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇప్పటికే 54 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా రూ, 546 కోట్లతో మిగిలిన పనులు పూర్తిచేసి మరో 41 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దేవాదులలో 512 కోట్లతో మిగితా పనులు పూర్తిచేసి మరో లక్షా 32వేల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ ఏడాది 7115 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు లక్షా 11 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందుకోసం 1487 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు : 6 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులు 4 ఉన్నాయి. కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల్లో మిగిలిన పనులు పూర్తి చేయటం ద్వారా అదనపు ఆయకట్టు సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కోయిల్‌సాగర్ ద్వారా మరో 3078 ఎకరాలు, భీమా కింద 21 వేల ఎకరాలు, నెట్టెంపాడు కింద 35 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.
ఇందుకోసం కోయిల్ సాగర్‌కు 121 కోట్లు, భీమాకు 127 కోట్లు, నెట్టెంపాడుకు 67 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. కల్వకర్తి ఎత్తిపోతల కింద ఇప్పటికే 3 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందుతుండగా, ఈ ఏడాది మరో లక్షా 34 వేల ఎకరాల ఆయకట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందుకోసం రూ.489 కోట్లతో పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. డిండి ఎత్తిపోతలకు రూ.1881 కోట్లు ఖర్చు చేసి ఈ ఏడాది 8 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు.
ఎస్సెల్బీసీ పనుల కోసం రూ.1679 కోట్లు వ్యయం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఏఎమ్మార్ ఎస్సెల్బీసీ కింద ఈ యేడు 50వేల ఎకరాల అదనపు ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ ఏడాది మొత్తంగా రూ.7406 కోట్లతో 5,87,770ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న 9, 20, 21, 21ఏ, 22 ప్యాకేజీల పనులను ప్రాధాన్యంగా ఎంచుకున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి మిగిలిన పనులు పూర్తి చేసి 2026 కల్లా ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రాజెక్టుల భూసేకరణ, పనులకు వెయ్యి కోట్లు అవసరమని అంచనా వేశారు. నిర్ధేశిత లక్ష్యం మేరకు పనులు జరిగేలా ప్రతి 15రోజులకు ఒకసారి సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదప్రవాహం - Telangana irrigation projects
సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల ట్రయల్ రన్ సక్సెస్ - త్వరలోనే ప్రారంభం - Sitarama Project Trial Run