Telangana Govt Focus On Excise Revenue : రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆబ్కారీ శాఖ ద్వారా ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్‌ల ద్వారా రాష్ట్రానికి 36 వేల 493 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక ఏడాదిలో 40 వేల కోట్లకు పైగా రాబడి వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరగటంతో రాబడులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ప్రతీ నెల 2వేల 800 నుంచి 3వేల కోట్ల వరకు ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక వనరులు సమకూర్చే శాఖలతో సమీక్ష నిర్వహించినప్పుడు ఆబ్కారీ శాఖ నుంచి వచ్చే ఆదాయం కూడా పెరగాలని ఆదేశించారు.
రాష్ట్రంలో 2వేల 620 మద్యం దుకాణాలు, దాదాపు 11 వందల వరకు బార్‌లు, పబ్బులు, క్లబ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలో 36 వేల కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు గత ఆర్థిక ఏడాదిలో జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే గతేడాది వరసగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు పెరిగి రాబడి కూడా పెరిగిందని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. 2023 డిసెంబర్‌లో అత్యధికంగా 4 వేల 297 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
అక్రమ మద్యంపై ఉక్కుపాదం : ఎన్నికల ఫలితాలు వెలువడడం, నూతన సంవత్సరానికి అవసరమైన మద్యం ముందే స్టాక్ తెచ్చిపెట్టుకోవడంతో ఆ నెలలో రాబడి భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.ఈ ఏడాది కూడా రాబడి పెంచాలని చూస్తున్న ఆబ్కారీ శాఖ అక్రమ మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. అదే విధంగా గుడుంబా తయారీ, సరఫరా, విక్రయాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించిన ఎక్సైజ్ అధికారులు దాడులను ముమ్మరం చేశారు.
హైదరాబాద్ గుడుంబా తయారీ కేంద్రంగా పేరున్న దూల్‌పేటలో ప్రతిరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలతో పాటు ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆబ్కారీ శాఖ డైరెక్టర్ కమల్‌హాసన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్ స్థాయినుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు అంతా తనిఖీల్లో పాల్గొంటున్నారు.
తనిఖీలు ముమ్మరం చేసిన ఆబ్కారీ శాఖ : సాధారణంగా మద్యం అమ్మకాలపై విధించే వ్యాట్ ద్వారా ప్రతి నెల సగటున 1250 నుంచి 13 వందల కోట్ల రూపాయల వరకు రాబడి పెరిగింది. ఏప్రిల్‌లో 1580కోట్ల 43లక్షలు, మే నెలలో 1740 కోట్ల 80 లక్షల లెక్కన వ్యాట్ ఆదాయం వచ్చినట్లు కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు నెలల్లో వచ్చిన వ్యాట్ రాబడి మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈవెంట్లకు అనుమతులు ఇచ్చినప్పుడు తెలంగాణ మద్యాన్ని వాడుకుంటూ మిగిలినదంతా బయట రాష్ట్రాల నుంచి తెచ్చిన అక్రమ మద్యాన్ని వాడుతున్నట్లు ఆబ్కారీ శాఖ దృష్టికి రావడంతో తనిఖీలు ముమ్మరం చేశారు.
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 14వేల 508 ఈవెంట్లకు అనుమతులు ఇవ్వగా ఇందులో సింహభాగం హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలోనే ఉన్నాయి. ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో పలు ఈవెంట్లలో తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం వాడుతున్నట్లు గుర్తించి 302 కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. నిరంతరం తనిఖీలు చేయడం ద్వారా అక్రమ మద్యం కట్టడి చేయడంతో పాటు గుడుంబా తయారీని నిలువరించగలిగామని ఆబ్కారీశాఖ చెబుతోంది.