Telangana Govt on Crop Loan Waiver Scheme 2024 : ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.14,000ల కోట్ల ఆదాయం వస్తుండగా అంతకు మించిన ఖర్చులు ఉన్నాయి. ఆ ఆదాయం నుంచి రైతుసంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం సాధ్యపడదని ఆర్థికశాఖ అంచనా. వారానికోసారి బాండ్ల విక్రయం ద్వారా రూ.1000 కోట్ల నుంచి రూ.2000ల కోట్ల దాకా రుణాలను తెలంగాణ సర్కార్ సేకరిస్తోంది.
Rythu Runamafi in Telangana 2024 : కానీ అలా తక్కువ మొత్తంలో కాకుండా ఒకేసారి రూ.10,000ల కోట్ల నుంచి రూ.20,000ల కోట్ల దాకా సొమ్మును బాండ్ల ద్వారా సేకరించి రుణమాఫీ పథకానికి చెల్లించవచ్చా అని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆర్థిక బాధ్యత-బడ్జెట్ నిర్వహణ- ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి మాత్రమే బాండ్ల విక్రయం ద్వారా రుణ సేకరణకు రిజర్వ్ బ్యాంక్ అనుమతిస్తుంది.
ఎఫ్ఆర్బీఎం పరిమితి మించకుండా జాగ్రత్తలు : 2023-24లో రాష్ట్రం ఆ పరిమితి కింద రూ.49,589 కోట్ల రుణాలు సేకరించింది. వాటిలో 2023 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ ఐదు నెలల్లో గత సర్కార్ రూ.26,158 కోట్లు సేకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.50,000ల కోట్లకు మించి రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి సేకరించే అవకాశాలున్నాయి. వాటి నుంచి గతేడాది మాదిరిగానే ఆగస్ట్‌లోగా రూ.40,000ల కోట్లను తీసుకుంటే మూడు పథకాలకు సర్దుబాటు చేయడం సాధ్యమని అంచనా.
ఆర్బీఐ అంగీకరిస్తుందా అనేది కీలక ప్రశ్న : 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.8246 కోట్లను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్రం సేకరించింది. మరో రూ.2,000ల కోట్లు ఈ నెల 18న బాండ్ల విక్రయం ద్వారా రానున్నాయి. ఆ మొత్తంతో కలిపితే ఈ ఏడాది కోటాలో రూ.10,000ల కోట్లు అవుతున్నందున మరో రూ.30,000ల కోట్లను ఆగస్ట్‌లోగా తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అనేది కీలక ప్రశ్నగా మారింది. ఇదేసమయంలో ప్రత్యామ్నాయ మార్గాలనూ తెలంగాణ ప్రభుత్వం అన్వేషిస్తోంది.
కొత్తగా రైతు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుచేసి సర్కార్ గ్యారంటీ ఇచ్చి, ఒకేసారి రూ.35,000ల కోట్ల వరకూ రుణం తీసుకునే అవకాశం ఉంటుందా అనే చర్చ సాగుతోంది. కార్పొరేషన్‌కి అంత భారీగా రుణమివ్వాలంటే అదేసంస్థ తిరిగి చెల్లిస్తుందని అందుకువచ్చే ఆదాయ మార్గాలను స్పష్టంగా చూపాల్సి ఉంటుంది. ఒక సంస్థ లేదా ఒక పథకం పేరిట ఇచ్చే రుణం సొమ్మును అందుకోసమే వినియోగించాలని, అలాచేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడం చెల్లదని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ గ్రూప్ సిఫార్స్ చేసింది. ఈ నేపథ్యంలో వాటితోపాటు రుణ సేకరణకు ఉన్న ఇతర అవకాశాలేమిటని ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చ జరుపుతోంది.
నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాకే మాఫీ : రుణమాఫీ సొమ్మును జులై 15 నుంచి ఆగస్ట్15 వరకూ దశలవారీగా తొలుత రూ.50,000ల లోపు, ఆ తర్వాత నిధుల లభ్యతను బట్టి రూ.75,000లు, లక్ష పెంచుతూ బ్యాంకులకు జమచేసే విధానాన్ని సర్కార్ పరిశీలిస్తోంది. రైతుల్లో 70 శాతం మందికి లక్షలోపే బాకీ ఉన్నట్లు అంచనా. వారికి తొలిదశలో మాఫీచేసి మిగిలిన వారికి విడతలవారీగా ఆగస్ట్ 15లోగా జమచేస్తే ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక రుణమాఫీకి అర్హులైన అన్నదాతల గుర్తింపు, వారి తరఫున బ్యాంకులకు ప్రభుత్వ చెల్లింపు విధానం ఖరారవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అన్నదాతలకు శుభవార్త : ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ - వెంటనే 3 లక్షల రుణాలు!