New Revenue Laws in Telangana : రాష్ట్రంలో తరుచుగా తలెత్తుతున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ సర్కారు మరో సంస్కరణకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టం, పేదలు, రైతులకి వరంగా మారనుంది. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఆర్వోఆర్ చట్టం -2024 ముసాయిదాని తీర్చిదిద్దారు. రోజురోజుకీ మారుతున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా చట్టంలో నిబంధనలు పొందుపర్చారు.
మంత్రుల చొరవ : అవసరమైతే ప్రజాభిప్రాయం మేరకు మార్పులు చేసేందుకు వీలుగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచారు. రెవెన్యూ సేవలు సులభంగా, వేగవంతంగా అందడమేకాక రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేలా చట్టం కార్యరూపుదాల్చడంలో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి ముందుచూపుతో వ్యవహరించారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ధరణి కొత్త బిల్లుపై ప్రజాభిప్రాయం - సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఇదే వెబ్సైట్
డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్వోఆర్ చట్టం-2024 ముసాయిదాపై హైదరాబాద్ బేగంపేటలో చర్చా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా భూ చట్టాల నిపుణులు భూమి సునీల్‌కుమార్, ఉస్మానియా వర్సిటీ లా ప్రొఫెసర్ జీబీరెడ్డి, విశ్రాంత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ధరణి కమిటీ సభ్యులు, 18 రాష్ట్రాలకు చెందిన భూ చట్టాలను క్రోడీకరించి కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. రాబోయే రెండు దశాబ్దాలని దృష్టిలో పెట్టుకొని చట్టం రూపొందించినట్లు సునీల్ వివరించారు.
"భూసమస్యలతో రైతులు నేడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చినట్లయితే వారి తిప్పలు తప్పినట్లే. రాబోయే రెండు దశాబ్దాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈచట్టం రూపొందించాము". - సునీల్ , భూ చట్టాల నిపుణులు
కొత్త చట్టంతో రైతులకు సత్వర సేవలతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కానుందని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలకు అక్కడే పరిష్కారం చూపేలా నూతన విధానం ఉండబోతుందన్నారు. బిల్లు చట్టరూపం దాల్చితే సుదూర ప్రాంతాల నుంచి సీసీఎల్ఏకు రావాల్సిన దుస్థితి అన్నదాతలకు ఉండబోదని వివరించారు.
"గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో కొత్త భూసమస్యలు ఉత్పన్నమయ్యాయి. రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో ఇకపై రైతులు సీసీఎల్ఏకు రావాల్సిన అవసరం ఉండదు". - లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
కొత్త చట్టం అమలులోకి వస్తే రైతులు కోర్టుమెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదని ఉస్మానియా వర్సిటీ జీబీరెడ్డి అభిప్రాయపడ్డారు. కొత్త చట్టం అత్యున్నతమైందిగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తైన తర్వాత కొత్తచట్టంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.