Telangana Governor Jishnu Dev Varma visit to Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ మంగళవారం లక్నవరం సరస్సులో బస చేశారు. ములుగు జిల్లాలో కళాకారులు, క్రీడాకారులు, రచయితలు, గిరిజన ప్రాంతం ముఖ్యులతో విందులో పాల్గొన్నారు. అనంతరం వెంకటాపూర్ మండలం రామప్ప దేవాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉన్న శిల్పాలను గైడ్ ద్వారా తెలుసుకున్నారు. ఆలయ శిల్పాలను చూసి గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో ఉన్న కోటగులను సందర్శించి సాయంత్రం లక్నవరం సరస్సుకు బయలుదేరి అక్కడే బస చేశారు. బుధవారం ఉదయం లక్నవరం సరస్సులో బోటులో గవర్నర్‌తో పాటు రాష్ట్ర మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ శబరీశ్ లక్నవరం సరస్సులో బోటు షికారు చేశారు. ఈ కొండల మధ్య ఉన్న సరస్సులో చుట్టూ పచ్చటి అడవి అందాలను తిలకిస్తూ ఆనందపడ్డారు. ఇంతటి ప్రకృతి అందాల మధ్య సరస్సు ఉండడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. సరస్సులో అక్కడక్కడ ఉన్న దీవులను పరిశీలించారు. ఈ సరస్సును అభివృద్ధి చేసి పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
అనంతరం హనుమకొండకు విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. రెండు జిల్లాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్లు గవర్నర్‌కు వివరించారు. మధ్యాహ్నం పద్మాక్షి, వేయిస్తంభాల గుడి భద్రకాళీ ఆలయం, వరంగల్ కోటను సందర్శించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వేయి స్తంభాల గుడిని సందర్శించిన గవర్నర్ : హనుమకొండ వేయిస్తంభాల ఆలయాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ శర్మ సందర్శించారు. గవర్నర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతను, శిల్పాల ప్రాముఖ్యతను విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు తెలియజేశారు. ఇటీవలే పునర్నిమించిన కల్యాణ మండపాన్ని గవర్నర్ వీక్షించారు. మండపం నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను తిలకించారు.
ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ అధికారులు గవర్నర్‌కు స్వామి శేషవస్త్రాలను బహుకరించి, వేదాశీర్చచనాలు పలికారు. కాకతీయ కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని గవర్నర్ అన్నారు. శిల్ప సంపద రమణీయంగా ఉందని కొనియాడారు. భారతదేశం చారిత్రక సంపదకు నిలయమని, మరుగున పడుతున్న వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకురావడమే సవాల్ అని పేర్కొన్నారు. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని గవర్నర్ జిష్ణు దేవ వర్మ అన్నారు.
తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం - GOVERNOR JISHNU DEV OATH CEREMONY