Telangana Govt To Increase Land Price 2024 : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరించడంపై సర్కార్ దృష్టిసారించింది. 2013లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. ఆ తరువాత ఏడేళ్ల పాటు ఎలాంటి పెంపు జరగలేదు. దీంతో బహిరంగ మార్కెట్ విలువలకు, మార్కెట్ ధరలకు భారీగా వ్యత్యాసం ఏర్పడింది. 2021 ఆగస్ట్‌లో 15 నుంచి 20 శాతం వరకు మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువలను పెంచిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే మరోసారి పెంచింది.
ధరల పెంపు కోసం కమిటీ : ధరలు పెంచి రెండేళ్లు దాటినందున రిజిస్ట్రేషన్ ధరలకు, బహిరంగ మార్కెట్ ధరలకు వ్యత్యాసం అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిని మరొకసారి పెంచేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలోని 143 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్‌గా, అదనపు కలెక్టర్ ఛైర్మన్‌గా, ఎమ్మార్వో, స్థానిక సంస్థల ప్రతినిధిగా ఐదుగురితో మార్కెట్ ధరల పెంపు కమిటీని ఏర్పాటు చేయనుంది.
అంతకు ముందే రాష్ట్ర స్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమై, క్షేత్రస్థాయిలో మార్కెట్ ధరల పెంపునకు ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్నమార్గదర్శకాలను సిద్ధం చేసి కమిటీలకు అందచేస్తారు. ఈ మార్గదర్శకాలతో పాటు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లను కమిటీ పరిశీలిస్తుంది. అదేవిధంగా బహిరంగ మార్కెట్లో స్థిరాస్తి ధరలనూ తెప్పించుకుంటుంది. వీటిన్నింటిపై ఆయా కమిటీలు చర్చిస్తాయి.
విమర్శలకు తావులేకుండా పెంపు : విమర్శలకు తావులేకుండా ఏయే ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది, అక్కడ హేతుబద్దంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన చర్చ చేస్తాయి. ఆయా కమిటీలు తమ నివేదికలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు అందిస్తాయి. ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు సమావేశమై కమిటీల నుంచి అందిన నివేదికలను మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటారు.
రూ.2,000ల కోట్ల ఆదాయం పెరిగే అవకాశం : గడిచిన రెండున్నర సంవత్సరాలకు ఇప్పటికి ధరలను పరిశీలించినట్లయితే బహిరంగ మార్కెట్ ధరలకు, మార్కెట్ ధరలకు వ్యత్యాసం భారీగానే ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నల్గొండలో కొంత భాగంలో కమర్షియల్ రహదారులను గుర్తిస్తారు. అక్కడ తాజాగా ఉన్న మార్కెట్ ధరలను, ఓపెన్ మార్కెట్ ధరలతో బేరీజు వేసి ఎంత మేర పెంచొచ్చన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. కనీసం 15 శాతం నుంచి 20 శాతం మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా రెండు వేల కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Telangana Stamps and Registrations Revenue : తెలంగాణలో ప్రతి సంవత్సరం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరుగుతూనే ఉంది. కరోనా సమయం మినహాయిస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014-15 ఆర్థిక తొలి ఏడాదిలోనే రూ.2745 కోట్ల ఆదాయాన్ని ఆ శాఖ సమకూర్చుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.5177 కోట్లకు ఎగబాకింది. 2019-20లో రూ.7061 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ధరణి పోర్టల్ కారణంగా మూడు నెలలు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం, కొవిడ్ కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గడంతో 2020-21లో కేవలం 12,10,000ల రిజిస్ట్రేషన్లు జరిగి రూ.5260 కోట్ల ఆదాయానికే పరిమితమైంది.
2021-22 ఆర్థిక ఏడాదిలో ఏకంగా 19,72,000ల రిజిస్ట్రేషన్లు జరిగి రూ.12,370 కోట్ల ఆదాయాన్ని పెంచుకుంది. 2022-23లో స్వల్పంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా ధరల పెంపు కారణంగా రూ.14,291 కోట్లు రాబడి వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రూ.18,500 కోట్లు రావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అదేవిధంగా సగం రోజులు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా నియమావళి అమలులో ఉండడం, నగదు లావాదేవీలపై ఆంక్షలు ఉండడం తదితర అంశాల కారణంగా రూ.14,588 కోట్లు మాత్రమే వచ్చింది.
రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!