Dy CM Bhatti Vikramarka Announced 12,000 For Landless poor : భూమిలేని నిరుపేద కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని ఈనెల 28 నుంచి కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిరుపేద కూలీలకు మొదటి విడతగా రూ.6 వేలు : దేశ స్వాతంత్య్రం కోసం ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు డిసెంబరు 28న నిరుపేద కూలీలకు మొదటి విడత డబ్బులు 6వేల రూపాయలు ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి, రైతన్నల కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు.
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కలిగించి ప్రజలను మోసం చేయడమే బీఆర్ఎస్ నాయకులకు తెలుసని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల విస్తరణకోసం ప్రజా ప్రభుత్వం కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు చేయనుందని వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి తలమానికంగా మూసీని అభివృద్ధి చేయడానికి మూసీ పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్‌రోడ్ : అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్‌రోడ్ ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఔటర్ రింగ్‌రోడ్, రీజినల్ రింగ్‌రోడ్ మధ్య ఇండస్ట్రియల్, హౌసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు అందించబోతున్నామన్నారు. రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆసుపత్రులు, ఉద్యోగుల జీపీఎఫ్, మధ్యాహ్న భోజనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర బకాయిలు రూ.40,154 కోట్లు. పదేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7,11,911 కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపిందని భట్టి విక్రమార్క ఆక్షేపించారు.
ప్రజాప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తోంది : రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు 2014 నాటికి ఏడాదికి చెల్లించాల్సిన అప్పు 6,400 కోట్ల రూపాయలు ఉండగా, పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల ఏడాదికి రూ.66,782 కోట్లు చెల్లించే దుస్థితికి బీఆర్ఎస్ తీసుకెళ్లిందని భట్టి విక్రమార్క విమర్శించారు. సన్నాలపై క్వింటాకు ఇస్తున్న రూ.500 బోనస్ ద్వారా ప్రతి ఏకరానికి రూ.10వేల నుంచి 15వేల వరకు అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తోందన్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి రైతులకు నేరుగా 50,953 కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని భట్టి విక్రమార్క తెలిపారు.
రైతులకు RBI గుడ్‌న్యూస్- ఇకపై తాకట్టు లేకుండా రూ.2లక్షల లోన్!