Govt on New Revenue Officers In Telangana : గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెవెన్యూ గ్రామానికొక జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించనున్నారు. 2020 అక్టోబరుకు ముందు గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్వో, గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్‌ఏ వ్యవస్థలు ఉండేవి. రెండూ కలిపి రాష్ట్రంలో 25 వేల 750 పోస్టులు ఉండేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసింది. వారిని ఇతర శాఖలకు బదలాయించింది. ఫలితంగా గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రభుత్వం గుర్తించింది.
క్షేత్రస్థాయిలో పాలనాపరంగా యంత్రాంగానికి వీఆర్వో, వీఆర్ఏలు కీలకంగా వ్యవహరించేవారు. విపత్తులు, పంట నష్టం అంచనాలు మొదలు ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, సమాచారం చేరవేతకు మాధ్యమంగా పనిచేశారు. ప్రధానంగా వీరు ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణకు తోడ్పడేవారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూశాఖపై సమీక్ష చేశారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పటిష్ఠ పర్చడంలో భాగంగా సిబ్బంది నియామకానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గతంలో పనిచేసిన వీఆర్ఏ, వీఆర్వోలకు ప్రాధాన్యం : రాష్ట్రంలో 10 వేల 954 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించాలని రెవెన్యూశాఖ ప్రతిపాదిస్తోంది. వారిని జూనియర్ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ కార్యదర్శి పేరు పెట్టేందుకు సిఫార్సు చేసింది. డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత కలిగిన వారిని ఈ పోస్టుకు తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు అందాయని తెలుస్తోంది. ఆర్థిక భారం లేకుండా పాతవారితోనే పోస్టులను భర్తీ చేయాలని సర్కారు భావిస్తోంది. గతంలో వీఆర్ఏ, వీఆర్వోలను ఇతర శాఖలకు బదలాయించినా ఇప్పటివరకు సర్దుబాటు కాలేదని సమాచారం.
సర్వీసు ఇబ్బందులు, ఇతర శాఖల్లో సమానమైన పోస్టులు లేకపోవడం వంటి ఇబ్బందులతోపాటు వారికి చేసేందుకు పని లేదని పేర్కొన్నట్లు తెలిసింది. మరికొన్ని శాఖల్లో వేతనాలు అందని పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరులు, చెట్ల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణకు జూనియర్ రెవెన్యూ అధికారులు ఉపయోగపడనున్నారు. అన్నిరకాల ధ్రువపత్రాలకు సంబంధించి విచారణలు, ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, భూ సర్వేకు సహాయకారిగా ఉండటం, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు అందించడం వంటి బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.