Commercial Tax Case Transferred to CID : తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విభాగంలో జరిగిన రూ. 1400 కోట్ల కుంభకోణం కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలసి జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించినట్టు వాణిజ్యశాఖ అధికారులు అంతర్గత ఆడిటింగ్‌లో గుర్తించారు.
11 ప్రైవేటు సంస్థల వల్ల రూ. 400 కోట్లు, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ రూ. 1000 కోట్ల మేర పన్ను ఎగవేతతో నష్టం వాటిల్లినట్టు నిర్ధారించారు. దీనిపై నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేయటంతో సోమేశ్ కుమార్‌తో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. 72 కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా సోమేశ్ కుమార్ వ్యవహరించినట్టు అభియోగాలు నమోదయ్యాయి.
Big Scam in Commercial Tax Department : సంచలనం రేకెత్తించిన కేసుతో ఏపీ, దిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని కంపెనీలతో సంబంధాలున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణకు వచ్చారు. కేసు తీవ్రత దృష్ట్యా సీసీఎస్ నుంచి సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఈ స్కాంకు సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించింది. రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్‌ల్లో అక్రమాలను గుర్తించడంతోపాటు డేటాను విశ్లేషించడం సర్వీస్ ప్రొవైడర్ చేయాల్సిన పని. పన్నుచెల్లింపుదారుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన ‘స్క్రూటినీ మాడ్యూల్’ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. కానీ బిగ్‌లీప్ టెక్నాలజీస్ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్ కనిపెట్టలేదు.
అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్‌వేర్‌లో ఛేంజస్ : బిగ్‌లీప్ అక్రమాల నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ నియమించిన ఓ ఆఫీసర్ గతేడాది డిసెంబరు 26న ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో విచారణ జరిపారు. అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీతోపాటు ఎస్.వి.కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ల మౌఖిక ఆదేశాల మేరకు అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు ఆయన తన రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఐజీఎస్టీలో అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్‌వేర్‌లో ఛేంజస్ చేసిన కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు వివరించారు. అలాగే ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలోని ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను వాణిజ్యపన్నుల శాఖ వివరణ కోరింది. సోమేశ్‌కుమార్ ఆదేశాలతోనే తాము సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని సూచించినట్లు వారిద్దరు సమాధానమిచ్చారు.
Commercial Tax Case in Telangana : వాణిజ్యపన్నుల శాఖకు సంబంధించి తామెలాంటి సాఫ్ట్‌వేర్‌ను డెవలెప్ చేయలేదని ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వివరణ ఇచ్చింది. ఈనేపథ్యంలో తమ శాఖకు, ఐఐటీ హైదరాబాద్‌కు జరిగిన ఒప్పందం గురించి మరింత లోతుగా వివరాలు రాబట్టేందుకు జనవరి 25న స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌కు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు లేఖ రాశారు. పలు లోపాలున్నట్లు ఆడిట్ డిపార్ట్‌మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. డేటా అంతా ఐఐటీ హైదరాబాద్ నియంత్రణలోనే ఉన్నట్లు, డేటాలో అవసరమైనప్పుడు మార్పులు చేసేందుకు అవకాశముందని పేర్కొంది. ఈ విధంగా వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణలో తీగ లాగితే డొంక కదిలింది.