TG Govt Focus on Grama Sabhalu : కొత్త పథకాల అమలుకు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరగనున్నాయి. ఈ నెల 24 వరకు సభలు నిర్వహించి, లబ్ధిదారుల ఎంపికకు తుది కసరత్తు జరగనుంది. సభల్లో కుటుంబ సభ్యులు, ఆధార్ తదితర వివరాలతో కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకోని వారు సభల్లో ఇవ్వొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహా 4 కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
నేటి నుంచి గ్రామ, వార్డు సభలు : గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల కోసం నేటి నుంచి తుది కసరత్తు జరగనుంది. ఆ నాలుగు పథకాల అమలు ప్రక్రియలో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. పంచాయతీల్లో గ్రామ సభలు, నగరాలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహిస్తారు.
కొత్తగా దరఖాస్తులు : రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తులో పేర్కొన్న వారి నుంచి కుటుంబ సభ్యులు, ఆధార్, ఫోన్ నంబరు, కులం, చిరునామా వివరాలతో కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇప్పుడున్న కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడం కోసం గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామ, వార్డు సభల్లో సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఎకరానికి ఏటా రూ.12 వేలు : రైతు భరోసా పథకంలో పంట పెట్టుబడి సాయం కోసం ఎకరానికి ఏటా రూ.12 వేలను రెండు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట వేసినా, వేయకున్నా సాగుయోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఐతే సాగు యోగ్యం కాని భూములకు పథకం వర్తించదని స్పష్టం చేసింది.
రైతు భరోసా పథకం : ఆ భూములను గుర్తించేందుకు వ్యవసాయ, రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కూడిన బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. ఇప్పటికే గుర్తించిన అర్హుల ముసాయిదా జాబితాను గ్రామ, వార్డు సభల్లో వెల్లడించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది రైతు భరోసా పథకానికి అర్హులైనట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.
గ్రామ, వార్డు సభలు : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ, వార్డు సభల్లో కొలిక్కిరానుంది. తొలి విడతలో స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే స్థలం లేని అర్హుల జాబితా ఖరారు చేసే ప్రక్రియ కొన్నాళ్లుగా సాగుతోంది. ప్రజా పాలనలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర పథకానికి అనుగుణంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో దరఖాస్తుదారుల వివరాలు సేకరిస్తున్నారు.
గ్రామాల్లో సర్వే ముగిసినా జీహెచ్ఎంసీ వరంగల్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో పూర్తి కాలేదు. ఇప్పటి వరకు జరిగిన సర్వే ప్రకారం సుమారు 31 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో 18 లక్షల మందికి సొంత ఇంటి స్థలం ఉంటే, సుమారు 12 లక్షల మందికి స్థలం లేదు. స్థలం లేని సుమారు లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని సర్కార్ భావిస్తోంది. సుమారు 40 లక్షల దరఖాస్తులు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నట్లు సమాచారం.
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు : ఇందిరమ్మ ఇండ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకోని వారు నేటి నుంచి గ్రామ, వార్డు సభల్లో ఇవ్వవచ్చని ప్రభుత్వం తెలిపింది. సర్వే పూర్తికానివి కొత్తగా వచ్చే దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది. ఐతే ఈ నెల 26న లాంఛనంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేని అర్హులను కొంత మందిని ఖరారు చేసే అవకాశం ఉంది.
కొత్త రేషన్‌కార్డుల జాబితాలో పేరు లేని వారికి గుడ్ న్యూస్ - పాత రేషన్ కార్డులపై కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి జాబితా ఆ రోజే విడుదల - వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం