National Handloom Day Celebration in Telangana : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కళాకారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నాటి స్వాతంత్య్ర సంగ్రామంలోనూ నేడు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ చేనేత ప్రధానంగా నిలిచిందని కొనియాడారు. మహిళా శక్తి గ్రూపులు, ప్రభుత్వ శాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా చేనేత దినోత్సవం నిర్వహించారు.
ఈ నెల 16 వరకు కొనసాగనున్న చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రారంభించారు. నేత కార్మికుల బీమా కోసం రూ. 6 కోట్ల చెక్కును ఎల్ఐసీ అధికారులకు అందించారు. 32 మంది చేనేత కళాకారులను కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును మంత్రి తుమ్మల ప్రదానం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఎక్స్ వేదికగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలపాటు దగాపడ్డ చేనేత రంగానికి బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని కేటీఆర్ కోరారు.
జిల్లాల్లోనూ సంబరాలు నిర్వహించిన చేనేత కార్మికులు : బీఆర్ఎస్ పాలనలో చేనేత రంగానికి బంగారు బాటలు వేస్తే కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిందని హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అనుబంధ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. తెలంగాణ పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి పీపుల్స్ ప్లాజా వరకు ర్యాలీగా వెళ్లారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాల్లోనూ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో కేకు కోసి మిఠాయిలు పంపిణీ చేశారు. హనుమకొండలో కాళోజీ కూడలి నుంచి జడ్పీ హాల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ సత్యశారద చేనేత కళా వారసత్వాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తాపట్నాయక్ ర్యాలీని ప్రారంభించారు. నారాయణపేట చేనేత వస్త్రాలకు విదేశాల్లో గుర్తింపు ఉందని వివరించారు.
'గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు ప్రారంభించారు. కానీ అవి అరకొరగా ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి నేతన్న భారం కాదు. రైతులకు ఎంత చేస్తున్నామో చేనేత నేతన్నలకు అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది'- తుమ్మల నాగేశ్వరరావు, చేనేత, జౌళిశాఖ మంత్రి