Govt Focus on Commercial Tax Dept : ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం సహా పాలనలో పారదర్శకత తెచ్చే ఉద్దేశంతో ఇప్పటికే 20 మంది ఐఏఎస్, 28 మంది ఐపీఎస్‌ల స్థానచలనం చేసిన ప్రభుత్వం మరింత మందిని బదిలీ చేసే దిశలో కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే వాణిజ్య పన్నులశాఖను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రజలపై పన్నుల భారం వేయకుండా ఆదాయాన్ని పెంచుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ప్రతి ఏడాది వాణిజ్య పన్నులశాఖ ద్వారా దాదాపు రూ.80వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి జమవుతుండటంతో ఆ శాఖపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.
DY CM Review On GST Revenue : జీఎస్టీ వ్యాట్ రాబడులపై పూర్తిస్థాయిలో అధికారులు దృష్టిసారించాలని ఇటివలే వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో నిర్వహించిన భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. అయినప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్లు సర్కారు భావిస్తోంది. జీరోవ్యాపారం జరుగుతున్న స్థావరాలపై దృష్టిసారించడం, వ్యాట్, జీఎస్టీ ఎగవేతదారులపై ప్రత్యేక నిఘాఉంచడం, రిఫండ్లు చెల్లింపుల్లో వాణిజ్య పన్నుల శాఖ మార్గదర్శకాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల మదాపూర్ సర్కిల్, చార్మినార్ సర్కిల్, హైదరాబాద్ రూరల్ సర్కిల్ కార్యాలయాల పరిధిలో దాదాపు రూ. 100 కోట్లు విలువైన జీఎస్టీ రిఫండ్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార లావాదేవీలు చేయని బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసిన అక్రమార్కులకు ఇచ్చిన వైనం ఇందుకు బలం చేకూరుస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా రిఫండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించకుండా పక్కన పడేయడం వల్ల రూ.36 కోట్లకుపైగా మొత్తం వడ్డీ కింద చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
వాణిజ్య పన్నుల శాఖ ప్రక్షాలనపై : ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఆవకతవకలకు వాణిజ్య పన్నుల శాఖ నిలయంగా మారింది. ఈ నేపథ్యలో పన్నుల వసూళ్లు పెంచుకోడానికి శాఖను ప్రక్షాళన చెయ్యడమే మార్గంగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సహాయ కమిషనర్లు, వాణిజ్య పన్నుల అధికారులు, డిప్యూటీ వాణిజ్య పన్నుల అధికారులు సహాయ వాణిజ్య పన్నుల అధికారులను బదిలీ చేయడం ద్వారా నూతన ఉత్సాహాన్ని నింపినట్లవుతుందని భావిస్తున్నారు.
పన్ను ఎగవేతదారులపై ప్రభుత్వ నిఘా : పన్నుఎగవేతదారుల భరతం పట్టే దిశలో ప్రభుత్వం ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వే బిల్లుల వాడకంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా నిఘా పెట్టడం, వాహన తనిఖీలు ముమ్మరం చేయడం, అసెస్మెంట్ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం, న్యాయస్థానాల్లో యేళ్ల తరబడి మగ్గుతున్న పన్నుల చెల్లింపు కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే తద్వారా కూడా నిధులు సమకూరే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను ప్రక్షాళన చేయడం ద్వారా పన్నుల రాబడులు మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది.
మెరుగైన పనితీరు కనబర్చాల్సి ఉంది : ప్రధానంగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టికే.శ్రీదేవి అధికారులందరినీ సమన్వయం చేసుకొని, పని విభజన చేసి పని చేయించడం ద్వారా పనితీరులో నాణ్యత ప్రమాణాలు పెంచుకోవాల్సి ఉంది. ఆ దిశలో కమిషనర్ పనిచేయడం లేదన్న భావన ఆ శాఖలో వ్యక్తమవుతోంది. గతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్ కుమార్‌ను బూచిగా చూపి, ఆయనతో కలిసి చేశారన్న భావనతో దాదాపు డజనుమంది అధికారులను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. వారందరిని కీలకమైన బాధ్యతల నుంచి తప్పించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బదిలీల విషయంలో : ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన ఉన్నతాధికారుల బదిలీలను సైతం తానే చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇటీవల చార్మినార్ డివిజన్లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి వ్యక్తిగత సమస్యలపై నెల రోజులు సెలవుపై వెళ్లారు. తిరిగి జాయిన్ అయినా చార్మినార్ డివిజన్ జాయింట్ కమీషనర్ భాద్యతలు ఇవ్వలేదు. కార్యాలయ ఉత్తరాల ద్వారా కమిషనర్ కార్యాలయంలోనే నియమించారని తెలుస్తోంది.
హైదరాబాదు నగరంలో మరో డివిజన్ జాయింట్ కమిషనర్ కు పార్లమెంట్ ఎన్నికల సమయంలో దాదాపు నెల రోజుల సెలవు మంజూరు చేశారని సమాచారం. ఎన్నికలు జరుగుతున్న సమయంలో కోడ్ అమల్లో ఉన్నప్పుడు నెల రోజులు సెలవు ఇవ్వడం, ఆ డివిజన్‌కు ఇన్ఛార్జిగా పక్కనే ఉన్న మరో అధికారికి ఆ బాధ్యతలు ఇవ్వాల్సి ఉంది. కానీ అలా చెయ్యలేదు.
నిజామాబాద్ జాయింట్ కమిషనర్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారని సమాచారం. సెలవు నుంచి వచ్చిన అధికారికి తిరిగి తన డివిజన్ భాద్యతలు ఇచ్చారు. దీంతో ఒక్క అధికారికి ఒకరకంగా మరొ అధికారికి మరొరకంగా బాధ్యతలు ఇవ్వడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అనుమతి లేకుండా కార్యాలయ ఆధునికీకరణకు నిధులను ఖర్చు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదాయపెంపు మార్గాలపై సర్కార్ ప్రత్యేక దృష్టి.. వచ్చే ఏడాది లక్ష్యం ఎంతంటే?