TS Govt on Dharani Scam : 2018లో నాటి ప్రభుత్వం భూ సంబంధిత సమస్యల పరిష్కారంతో పాటు క్రయవిక్రయాలు సులభతరం చేసేందుకు ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా క్షేత్రస్థాయిలో ఇష్టానుసారంగా భూ వివరాలు పోర్టల్లో అప్‌లోడ్ చేయడం, భూహక్కులు కలిగి ఉన్న రైతుల ఆధీనంలోని భూములు సైతం నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. పొరపాట్లను సరిదిద్దేందుకు ఎక్కడో మారుమూల ఉన్న అన్నదాతలు సైతం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఎ కార్యాలయానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లు పైరవీలతో భూములను నిషేధిత జాబితా నుంచి తీయించుకోగలిగారు.
Dharani Committee Interim Report : కానీ చిన్న, సన్నకారు రైతులు మాత్రం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్‌ఎ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కాలేదు. కలెక్టర్లకు అధికారాల బదలాయింపు, కొన్నిమాడ్యూల్స్‌లో మార్పు చేసినా పూర్తిస్థాయిలో ధరణి సమస్యలు తీరలేదు. ప్రతిపక్షంలో ఉన్న నాటి కాంగ్రెస్ 20 లక్షల మందికి పైగా అన్నదాతల బాధలను చూసి, తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని, దాని స్థానంలో అంతకంటే మరింత మెరుగైన వ్యవస్థను తెస్తామని హామీ ఇచ్చింది.
Dharani Portal Problems 2024 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. భూ నిపుణులైన కోదండరెడ్డి, రేమాండ్ పీటర్, సునీల్ కుమార్, మధుసూదన్‌లతో కమిటీ వేసిన సర్కార్ సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిటీ అనేకసార్లు కలెక్టర్లు, దేవాదాయ, అటవీ, వక్ఫ్, భూదాన్ బోర్డు, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులతోనూ సమావేశాలు నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి ధరణి సమస్యలపై కమిటీ సభ్యులు లోతైన అధ్యయనం చేశారు.
మధ్యంతర నివేదికలో 123 సమస్యల గుర్తింపు : ప్రభుత్వానికి ఇచ్చిన మధ్యంతర నివేదికలో 123 సమస్యలను గుర్తించినట్లు పేర్కొన్నారు. దిగువ స్థాయిలో అప్పీలేట్ అథారిటీ లేకపోవడం అతి పెద్ద లోటుగా తేల్చింది. ఎక్కువ సమస్యలు కలెక్టర్‌తో సంబంధం లేకుండా మండల, రెవెన్యూ డివిజన్‌ల స్థాయిలోనే పరిష్కరించవచ్చని కమిటీ గుర్తించింది. దశాబ్దాలుగా రైతులు సాగుచేస్తున్నా ఫిజికల్ రికార్డులు, పోర్టల్ డిజిటలైజ్‌డ్ వెర్షన్‌లో సరిపోలకపోవడం వల్ల కొన్నిభూములు నిషిద్ధ జాబితాలోకి చేర్చారని తేల్చింది. రెండున్నర లక్షల దరఖాస్తుల పరిష్కారం కోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, దాదాపు 70 శాతం అర్జీలకు మోక్షం కల్పించినట్లు కమిటీ వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు
సర్కార్ ఆలోచనకు భిన్నంగా కొందరు అధికారుల తీరు : ఇప్పటికీ కొందరు అధికారులు సర్కార్ ఆలోచనకు భిన్నంగా నడుచుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు, రాజకీయ నేతలు కుమ్మక్కై ప్రభుత్వ భూములకు ఎసరు పెట్టినట్లు కమిటీ ప్రాథమిక అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల పరిధిలోని విలువైన భూములను నిషేధిత జాబితా నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కొందరు కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇబ్రహీంపట్నం మండలం మసీద్‌పురం గ్రామంలో మిగులు భూమి కింద ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన 25 ఎకరాల భూమిని పట్టాగా మార్చి ప్రైవేట్ వ్యక్తులు తమ పరం చేసుకున్నారని కమిటీ దృష్టికి వచ్చినట్లు సమాచారం. సంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో మూడెకరాల అసైన్డ్ భూమిని పట్టా భూమిగా మార్చేందుకు రూ.5 కోట్లు నజరానా అందుకున్నట్లు తెలుస్తోంది. కొందరి అధికారుల నిర్లక్ష్యం వల్ల వందలాది దరఖాస్తులు కలెక్టర్లు, సీసీఎల్‌ఎ వద్ద పేరుకుపోయి ఉన్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత చర్యలు : ధరణిని అడ్డుపెట్టుకుని ఇద్దరు కలెక్టర్లు, సీసీఎల్‌ఎలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి ఒకరు కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరంతా గత ప్రభుత్వ హయాంలో అన్నీతానై చక్రం తప్పిన ఓ ఉన్నతాధిధికారి కనుసన్నల్లో పని చేసినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ అయిన ఆ అధికారి వ్యవహారంపైనా తెలంగాణ సర్కార్ ఆరా తీస్తోంది. లోకసభ ఎన్నికలు ముగియగానే ధరణి కమిటీ మధ్యంతర నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎవరెవరు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారో కమిటీ సభ్యులు నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమయ్యారు. వీటన్నింటిపై కమిటీ సభ్యులు మరింత సమగ్రమైన నివేదిక సర్కార్‌కు అందచేసే అవకాశం లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు! - ధరణి పోర్టల్‌లోని వివరాల సేకరణపై సర్కార్ ప్రత్యేక నజర్
ధరణి పోర్టల్ ఐచ్ఛికాల్లో కీలక మార్పులు - భూ సమస్యలన్నింటికీ ఒకే అర్జీ ఉండాలన్న కమిటీ