Telangana Government Decision on Elite Bars : రాష్ట్రంలో ఆబ్కారీ ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. మద్యం సేవించే వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు, దాదాపు 1,200 బార్లు, క్లబ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం సేవించే మందుబాబుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో అదే స్థాయిలో ఆదాయం కూడా అధికంగా వస్తోంది. 2014-15లో మద్యం అమ్మకాలు, లైసెన్స్‌ల జారీ, ఇతరత్ర మార్గాలతో రూ.10,833 కోట్ల ఆదాయం వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా రూ.34,857 కోట్ల మేర ఆదాయం పెరిగింది. 2014-15 ఆర్థిక ఏడాది నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు చూస్తే మూడు రెట్ల కంటే ఎక్కువ రాబడి వృద్ధి నమోదైంది.
రాష్ట్రంలో మద్యం షాపుల వివరాలు :
షాపు రకం | సంఖ్య |
మద్యం దుకాణాలు | 2,620 |
బార్లు, క్లబ్‌లు | 1,200(సుమారుగా) |
న్యూ ఇయర్ కిక్కు - 4 రోజుల్లో రూ.770 కోట్ల మద్యం అమ్మకాలు
అధికంగా దుకాణాలు ఏర్పాటే కాదు, మద్యం విక్రయాలు సైతం జోరుగా సాగుతున్నాయి. 2022-23 ఆర్థిక ఏడాదిలో 34 ఎక్సైజ్ జిల్లాల పరిధిలో రూ.35,145 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.30,000 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు(Telangana Last Year Liquor Revenue) జరిగాయి. ఈ ఆర్థిక ఏడాది గత ఆర్థిక ఏడాది కంటే కనీసం రూ.2,000 కోట్లు అదనంగా రాబడి ఆబ్కారీ శాఖతోనే వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Telangana Government on Liquor Revenue : మద్యంతో ఆదాయం వచ్చినా, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుపోయిందని కొత్తగా ఏర్పడిన సర్కార్ ఆరోపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైందని విమర్శిస్తున్న ప్రభుత్వం, చక్కపెట్టే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎలైట్ బార్లు, రెస్ట్రారెంట్లు ఏర్పాటు చేయడంతో ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ దిశలో కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సాధారణ మద్యం దుకాణాలతో పాటు ఒకే ఒక్క ఎలైట్ మద్యం దుకాణం, దాదాపు 140 వరకు ఎలైట్ బార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల వేళ ఎక్సైజ్‌శాఖ అలర్ట్ - వాటి సరఫరాపై ప్రత్యేక నిఘా
Bhatti Vikramarka Favours Elite Bars for More Revenue : ఎలైట్ బార్లు, మద్యం దుకాణాలు ఏర్పాటుకు ఇప్పుడు రెగ్యులర్ లైసెన్స్‌ల ఫీజు కంటే 25 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆబ్కారీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దుకాణాల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ఎలైట్ లైసెన్స్‌లు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజులు నిర్ణయించిన ఆబ్కారీ శాఖ, దుకాణాలు, బార్లపై పర్యవేక్షణ కొరవడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా, ఎలైట్ బార్లు(Elite Bars in Telangana) లేదా ఎలైట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చే వ్యాపారులు ఎక్కడ ఏర్పాటు చేస్తారో అక్కడ అమలు అవుతున్న లైసెన్స్ ఫీజులో 25 శాతం అదనంగా చెల్లించినట్లయితే బార్లుకానీ, దుకాణాలుకానీ తెరచుకోడానికి అనుమతి ఇచ్చేందుకు శాఖాపరంగా చొరవ చూపాల్సి ఉంటుంది. అయితే దుకాణాలు అదనంగా ఏర్పాటు చేసినంత మాత్రాన ఉన్నపలంగా మద్యం అమ్మకాలు పెరగడం కానీ, రాబడి అధికంగా రావడం కానీ ఉండదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఉన్నత స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు రానివిధంగా ఈ ఆదాయాన్ని పెంచుకునే దిశలో చర్యలు ముమ్మరం చేయాలని ఆబ్కారీ శాఖ యోచిస్తోంది.
రాష్ట్రంలో ఎన్నికల వేళ తగ్గిన మద్యం అమ్మకాలు - అక్రమ లిక్కర్‌పై ఎక్సైజ్ శాఖ ఫోకస్