Caste Census survey In Telangana : తెలంగాణలో నవంబర్ 6 నుంచి కులగణన ప్రక్రియను ప్రారంభించనున్నారు. దేశంలో తొలిసారిగా ఇక్కడ కులగణన చేపట్టనున్నారు. ఆరోజే అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్యం యోచిస్తోంది. ఈమేరకు గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కులగణన తర్వాత ఏయే సంక్షేమ కార్యక్రమాలకు ఎంత నిధులు కేటాయించాలో తెలిసే అవకాశం ఉంది.
త్వరలో దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో కులగణనపై సమావేశాలు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వారిని ఆదుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన చేస్తున్నామన్నారు. సర్వేతో అందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో దేశమంతా తెలంగాణను అనుసరిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.
ఏమేం అడుగుతారంటే : మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా?, ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారా?, మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా?, ఎలా ఉపాధి పొందుతున్నారు?, భూమి ఉందా?, ఏడాదికి కుటుంబ ఆదాయం ఎంత వస్తుంది? ఈ వివరాలన్నీ సేకరించనున్నారు. ఈ మేరకు ఒక్కో కుటుంబంలోని సభ్యుల సమాచార సేకరణకు మొత్తం 60 ప్రశ్నలను తయారు చేశారు.
వీటిలో సగం కుటంబం నేపథ్యంపైనే ఉండగా, మిగిలినవి పర్సనల్ వివరాలకు సంబంధించినవి ఉంటాయి. ఈ ప్రశ్నల్లో ఏవి అవసరమో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంది. బీసీ కులాల వివరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. బీసీ కులాల వారితో పాటు రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరి కులం, ఉపకులం ఏమిటి? స్థానికంగా కులాల పేర్లలో ఏమైనా మార్పులున్నాయ? వంటి వివరాలన్నీ సేకరిస్తారు. ఎవరైనా కులం పేరు తప్పుగా నమోదు చేయిస్తే భవిష్యత్తులో అనేక రకాలుగా తీవ్రంగా నష్టం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు వివరాలు నమోదు కాకుండా స్థానిక అధికారులు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.