Telangana Govt appointed Dil Raju as TFDC Chairman : సినీ నిర్మాత దిల్ రాజుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ఆయనను నియమించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. ఆయన 1990లో 'పెళ్లి పందిరి’ సినిమాలో పంపిణీదారుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్ సినిమాకు తొలిసారి నిర్మాతగా వ్యవహరించగా ఆ చిత్రం భారీ విజయం సాధించింది. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు దిల్‌రాజుగా మారింది.
ప్రస్తుతం దిల్‌రాజు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది వచ్చే సంవత్సరం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దానితోపాటు అగ్ర కథానాయకుడు వెంకటేశ్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం కూడా వచ్చే సంవత్సరం జనవరి 14న విడుదల కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న తమ్మడు సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు.
సినీపరిశ్రమ కోసం దిల్‌రాజు డ్రీమ్స్ : మరోవైపు సినీ రంగంలో నూతన నటీనటులు, దర్శక నిర్మాతలను ప్రొత్సహించడంతో పాటు ఫెయిల్యూర్స్‌ను తగ్గించేలా తన వంతు ప్రణాళిక సిద్ధం చేసినట్లు గత నెలలోనే నిర్మాత దిల్‌రాజు తెలిపారు. ఈ మేరకు దిల్‌రాజు డ్రీమ్స్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవస్థ ద్వారా సంత్సరానికి ఐదు చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను డిసెంబర్ లేదా జనవరిలోనే భారీస్థాయిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. నటీనటుల, కథారచయితలు, ఔత్సాహిక దర్శక నిర్మాతలు, దిల్‌రాజు డ్రీమ్స్ ప్రతినిధులను సంప్రదించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని పేర్కొన్నారు. సినీపరిశ్రమ మేలు కోసం తన వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.