Bonus Announcement for Singareni Employees : సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ను ప్రకటించింది. సింగరేణి కార్మికులకు రూ.796 కోట్ల బోనస్‌ను ప్రకటించగా, అందులో ఒక్కో సింగరేణి కార్మికుడికి సగటున రూ.1.90 లక్షల బోనస్ అందనుంది. గతేడాది కంటే రూ.20 వేలు అదనంగా సింగరేణి కార్మికులకు బోనస్‌గా అందింది. అలాగే సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒప్పంద కార్మికులు ఒక్కొక్కరికీ రూ.5 వేలు బోనస్ ఇవ్వనుంది. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లు కాగా, ఆ లాభాల్లో 33 శాతాన్ని ప్రభుత్వం బోనస్‌గా ప్రకటించింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 'సింగరేణి రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లు. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నాం. సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటిస్తున్నాం. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు బోనస్ వస్తుంది. సింగరేణిలో శాశ్వత ఉద్యోగులు 41,837. సింగరేణిలో ఒప్పంద ఉద్యోగులకు కూడా బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం. సింగరేణి ఒప్పంద ఉద్యోగులకు ఒకొక్కరికి రూ.5 వేల బోనస్ ఇవ్వనున్నాం. సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్ ఇస్తున్నాం.' అని తెలిపారు.
ఎప్పుడు ప్రారంభించారు బోనస్‌లు ఇవ్వడం : 1990 దశకంలో తీవ్ర నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కార్మికులు, అధికారులు సమష్టిగా కృషి చేసి లాభాల బాట పట్టించారు. ఈ నేపథ్యంలో కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చి ప్రోత్సహించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 1999 -2000 సంవత్సరంలో తొలిసారిగా అప్పట్లో వచ్చిన రూ.300 కోట్ల లాభాల్లో 10 శాతాన్ని రూ.30 కోట్లను లాభాల వాటా బోనస్‌గా ప్రకటించారు. అప్పట్లో కంపెనీలో ఉన్న 1.8 లక్ష మంది కార్మికులకు ఒక్కొక్కరికీ సగటున రూ.2,782లుగా లాభాల వాటాగా పంపిణీ చేశారు. ఈ సాంప్రదాయం దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనూ చేయలేదు. నాటి నుంచి సింగరేణి సంస్థ వరుసగా లాభాలు సాధిస్తూ దేశంలోనే అగ్రస్థాయి సంస్థగా నిలుస్తూ వస్తోంది.
ఈ విధంగా 2021- 22 నాటికి అది 30 శాతానికి చేరుకోగా సగటున ఒక్కో కార్మికుడికి సుమారు 90 వేల రూపాయల వరకు లాభాల వాటా అందింది. ఈ ఏడాది సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 33 శాతం లాభాల వాటా బోనస్‌గా ప్రకటించడం వలన మస్టర్లు అధికంగా ఉన్న కార్మికులు రూ.2.5 లక్షలకు పైగా బోనస్ అందుకునే అవకాశం ఉంది అని యాజమాన్యం పేర్కొంటుంది. అయితే సగటున మాత్రం రూ.1,90,000 కార్మికులు అందుకోనున్నారు.
తొలిసారి ఒప్పంద కార్మికులకు బోనస్ : సింగరేణి కాలరీస్ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది పొరుగు సేవల కింద పని చేస్తున్న కాంట్రాక్టు, ఒప్పంద కార్మికులకు కూడా లాభాల బోనస్‌ను చెల్లించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. కంపెనీలో 25 వేల మంది వరకు కాంట్రాక్టు, పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో గత ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారికి నిబంధనల ప్రకారం బోనస్‌ను చెల్లించనున్నారు. సగటున రూ.5 వేల వరకు లాభాల బోనస్‌ను కాంట్రాక్టు కార్మికులు పొందే అవకాశం ఉంది అని సింగరేణి సంస్థ ప్రకటించింది.