65 New Procedures Added in Aarogyasri in Telangana : రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలోకి మరో 65 చికిత్సలను చేర్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నెముక సంబంధించి తదితర చికిత్సలను పథకం జాబితాలో చేర్చినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అందుకు అవసరమైన రూ.497 కోట్ల 29 లక్షలను విడుదల చేస్తూ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని 1,402 ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 1,672 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వైద్య నిపుణుల సూచనల మేరకు 1,375 చికిత్సలకు ప్యాకేజీల ధరను పెంచింది. ప్రభుత్వం ఈ పథకం కింద ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.10 లక్షల విలువ గల వైద్యాన్ని అందిస్తోంది. సుమారు 2.84కోట్ల మంది లబ్ధి పొందినట్లు ప్రభుత్వం పేర్కొంది.
కొత్త చికిత్సలకు రూ.158.30 కోట్లు : రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ఈనెల 7న సచివాలయంలో జరిగిన సమావేశంలో ప్యాకేజీల ధరలు పెంచడంతో పాటు కొత్త చికిత్సలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 1,375 చికిత్సలకు ధరలు పెంచడంతో పాటు 65 కొత్త చికిత్స విధానాలను చేర్చాలని భావించారు. ఈ క్రమంలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ లేని వారికి ఆయుష్మాన్ భారత్లోని 98 చికిత్స విధానాలకు సుమారు రూ.189.93 కోట్లతో పాటు కొత్తగా చేర్చిన 65 చికిత్సలకు దాదాపు రూ.158.20 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఖరిదైన చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10లక్షల వరకు పరిమితి పెంచుతామని ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసిన విధంగానే పరిమితిని పెంచింది. తాజాగా వాటిలో కొత్తగా 65 చికిత్సలను చేర్చింది. దీంతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. దీంట్లో ముఖ్యంగా యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నెముక వంటి ఖరిదైన చికిత్సలను చేర్చడం వల్ల సామాన్య ప్రజలకు ఆర్థికంగా ఎంతో మేలు జరగనుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
ఆరోగ్యశ్రీలో కొత్తగా 809 చికిత్సలు.. ఆ కార్డుల్లో హెల్త్ హిస్టరీ