VC Sajjanar on Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ అన్నారు. 'బస్ కా పయ్యా నహీ ఛలేగా' నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ సజ్జనర్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున సీఎండీ సజ్జనర్ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజులపాటు మేము సైతం అంటూ సకల జనుల సమ్మెను కొనసాగించారన్నారు. దేశ చరిత్రలో జరిగిన అతి పెద్ద సమ్మెల్లో సకల జనుల సమ్మె ఒకటిగా నిలిచిందన్నారు. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.
పెరిగిన బస్సు రవాణా : తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయింది అని సీఎండీ సజ్జన్నర్ పేర్కొన్నారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే అమలు చేశామని, ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తుండటం వల్లే మహాలక్ష్మి విజయవంతంగా అమలవుతోందన్నారు. మహాలక్ష్మి పథక అమలుకు ముందు ప్రతి రోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే ప్రస్తుతం రోజుకి సగటున 55 లక్షల మంది టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 7 ఏళ్లకుపైగా పెండింగ్ లో ఉన్న 2017 వేతన సవరణను చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ను సంస్థ ప్రకటించిందన్నారు.
పెండింగ్లో ఉన్న 9 డీఏలను మంజూరు చేశామని చెప్పారు. గత రెండేళ్లలో 1,500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2,000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారిగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2,990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు.