Excise Actions on Illegal Liquor Supply in Telangana : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినవారిపై 13వేల564 కేసులు నమోదు చేసిన ఆబ్కారీ శాఖ 6,443 మందిని అరెస్టు చేసింది. భారీ ఎత్తున అక్రమ మద్యం, మత్తు పదార్ధాలు, గుడుంబా, కల్తీకల్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 146 ఆబ్కారీ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన ఆబ్కారీ శాఖ నిరంతర నిఘాతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపుతూ వచ్చింది.
Illegal Liquor Supply in Elections : ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి గుడుంబా తయారీపై రాష్ట్రవ్యాప్తంగా 9వేల181 కేసులు నమోదు చేసి 2,621 మందిని అరెస్ట్ చేశారు. పెద్దఎత్తున గుడుంబా తయారీకి ఉపయోగించే సరుకుతో పాటు 349 వాహనాలు సీజ్ చేశారు. మాదకద్రవ్యాలకి సంబంధించి 124 కేసులు నమోదుచేసి 181 మందిని అరెస్ట్‌చేసిన ఎక్సైజ్‌శాఖ భారీగా గంజాయి అల్ఫాజోలం, ఎండీఎంఏ తదితర మాదకద్రవ్యాలు సీజ్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు చేసిన వారిపై 3వేల 606 కేసులు నమోదు చేసి 3వేల383 మందిని అరెస్టు చేయడంతో పాటు 638 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసింది. నాన్ డ్యూటీపెయిడ్ లిక్కర్ అమ్మిన వారిపై 182 కేసులు నమోదు చేసి 87 మందిని అరెస్టు చేశారు. కల్తీకల్లుతోపాటు అక్రమంగా కల్లు అమ్మినవారిపై 2800కి పైగా కేసులు నమోదు చేసి 174 మందిని అరెస్టు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా శనివారం సాయంత్రం నుంచి 48 గంటలపాటు రాష్ట్రంలో మద్యం విక్రయాలను ఆబ్కారీ శాఖ నిలిపివేసింది. మద్యం దుకాణాలు సహా బార్లు, క్లబ్‌లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, మద్యండిపోలు మూసివేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అక్రమ మద్యం సరఫరా, గుడుంబా, గంజాయి తదితర తయారీ, సరఫరా, అమ్మకాలపై ఆబ్కారీ శాఖ నిఘా పెట్టింది. బయట రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం, ఇతర మత్తుపదార్ధాలు సరఫరాకాకుండా నిలువరించేందుకు 21ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లోని తనిఖీ కేంద్రాలు 24 గంటలు పని చేస్తాయని ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎన్నికల వేళ ఎక్సైజ్‌శాఖ అలర్ట్ - వాటి సరఫరాపై ప్రత్యేక నిఘా
రాష్ట్రంలో ఎన్నికల వేళ తగ్గిన మద్యం అమ్మకాలు - అక్రమ లిక్కర్‌పై ఎక్సైజ్ శాఖ ఫోకస్