JAC Announced Donation to Telangana Flood Victims : తెలంగాణ వరద బాధితుల క్షేమం కోసం రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పక్షాన సాయం చేయడానికి ముందుకు వచ్చింది. అందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి తమ ఒకరోజు మూలవేతనాన్ని ఉద్యోగులు ప్రకటించారు. దాదాపు రూ.130 కోట్లను అందజేస్తూ జేఏసీ ఛైర్మన్ జగదీశ్, సెక్రటరీ జనరల్ ఎల్లూరి శ్రీనివాస్ రావు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ తీర్మానం చేశారు.
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు, తుఫాను ప్రభావానికి తమ వంతు ఒకరోజు బేసిక్ పేను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించుతున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. వర్షాలకు ప్రజల ప్రాణాలకు భారీగా హాని కలిగించే రీతిలో వరదలు సంభవించాయని, పంట, ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రజలు వేల కోట్ల నష్టాన్ని చవిచూశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, నాల్గో తరగతి ఉద్యోగులు ఒక రోజు మూలవేతనం మొత్తాన్ని సెప్టెంబర్ నెల జీతం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పత్రాన్ని మహబూబాబాద్‌లో సీఎం రేవంత్‌ను కలిసి ఇవ్వనున్నారు.
MLC Mallanna Donation To Flood Victims : మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో వరద ముంపు బాధితులకు తన వంతు సాయంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన ఒక నెల వేతనాన్ని ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వచ్చిన వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆ జిల్లాల ఎమ్మెల్సీగా తన నెల జీతం రూ.2.75లక్షల విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.
వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఆర్థిక సాయన్ని ప్రకటించిన ఆయన ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపారు. ఈ మేరకు చెక్కు పంపడంతోపాటు క్షేత్రస్థాయిలో బాధితులను ఆదుకోవాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.