Telangana Doctors Protest Against Kolkata Incident : కోల్‌కతా ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగాయి. నాలుగు రోజులుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఓపీ సేవలు నిలిపివేయగా, ఐఎమ్ఏ పిలుపుతో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు సైతం భాగస్వామ్యమయ్యాయి. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో సిబ్బంది ర్యాలీ చేపట్టారు. సీపీఏ చట్టం అమలు చేయాలంటూ పెద్దఎత్తున నినదించారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు చెందిన జూనియర్ డాక్టర్లు ఇందిరా పార్క్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మహిళల భద్రతపై చేసిన ఫ్లాష్ మాబ్ ఆలోచింపజేసింది.
హైదరాబాద్ కోఠీ వైద్య కళాశాల, గాంధీ ఆస్పత్రుల్లో నాలుగో రోజు జూడాల ఆందోళనలు కొనసాగాయి. నీలోఫర్ ఆస్పత్రి, సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి , ఈఎస్ఐ ఆస్పత్రుల ఎదుట వైద్యులు నిరసనలు చేపట్టారు. నాన్ మెడికల్ కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సైతం ఇందిరా పార్కులో ధర్నా చేపట్టారు. పలు ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు ఇందిరా పార్కులో ధర్నా చేస్తున్న వారికి మద్ధతుగా నిలిచారు. ఎంపీ కడియం కావ్య సైతం ఆందోళనలో పాల్గొని వైద్యులకు సంఘీభావం తెలిపారు.
"మహిళలకు ఎక్కడా భద్రత అనేదే లేకుండా పోతుంది. ఉమెన్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ అని ఏదైతే చెప్తూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, గర్ల్ చైల్డ్ డే పెట్టుకున్న థీమ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రతిరోజూ అమలు చేయాలి. చిన్నప్పటి నుంచే స్త్రీమూర్తులకు తగిన గౌరవం ఇవ్వాలి. అలాగైతేనే మగవాళ్లలో మార్పు వస్తుంది. మన ఊరు, మన దేశం సేఫ్గా ఉండాలంటే కచ్చితంగా మార్పు మన నుంచే రావాలి." -డా.కడియం కావ్య, వరంగల్ ఎంపీ
ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం మినహా నిలిచిన వైద్య సేవలు : పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీ విద్యార్థులు, వైద్య సిబ్బందితోపాటు ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి ఆసుపత్రులకు సంబంధించిన వైద్య సిబ్బంది పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. వరంగల్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపి సేవలు నిలిపివేసి వైద్యులు ఎంజీఎం ఆసుపత్రి గేటు ఎదుట ధర్నా చేపట్టారు. కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు ధర్నాకు మద్దతు తెలిపారు. హత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం చేయటంతోపాటు, సీపీఏ చట్టం అమలు చేసే వరకు నిరసనలు కొనసాగించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
'ఆమె' బాడీలో 150మిల్లీ గ్రాముల వీర్యం! వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా? - Kolkata Doctor Case