DGP Jitender on Ganesh Immersion 2024 : అన్ని ప్రభుత్వ విభాగాల సమన్యయంతో నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను విజయవంతం చేస్తామని రాష్ట్ర డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఇవాళ రాష్ట్ర పోలీసు యంత్రాంగం, జీహెచ్‌ఎంసీ అధికారులు బాలాపూర్ గణనాథుణ్ని దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు అధికారులను శాలువాలతో సన్మానించారు. అనంతరం బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు మార్గాన్ని డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ, రాచకోండ సీపీలతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు.
ప్రణాళిక సిద్ధం : ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో గణేష్ నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. నగరంలో బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేశామని డీజీపీ జితేందర్‌రెడ్డి వెల్లడించారు. గత ఏడాది కంటే ఈసారి బాగా చేస్తామని నమ్మకం ఉందని ఆయన వివరించారు. గత సంవత్సరం నిమజ్జన ఉత్సవాలు ఎలా జరిపామో అదే విధంగా ప్రణాళికను సిద్దం చేసి ఫాలో అవుతుమన్నారు. ఇందుకోసం 20వేల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
అదనపు బలగాలు : ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం మధ్యాహ్నం 1.30 లోపు నిమజ్జనం పూర్తి అవుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న ఉదయం 6 గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకొని తరలించే విధంగా ప్రణాళిక సిద్దం చేశామని వివరించారు. అదే రోజు తెలంగాణ విమోచన దినోత్సవం ఉన్నందున అదనపు బలగాలను బందోబస్తులో ఉంచనున్నట్లు తెలిపారు.
"నగరంలో గణేష్ నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించేలా 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. అన్ని ప్రభుత్వ విభాగాల సమన్యయంతో నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను విజయవంతం చేస్తాము". - జితేందర్, రాష్ట్ర డీజీపీ
వైన్స్ బంద్ : మరోవైపు బొజ్జ గణపయ్య నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు అన్నింటికీ రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేశారు. గణేశ్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ ఊరేగింపులు సజావుగా ముగిసేందుకు ధైర్యంగా, స్వేచ్ఛగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
హుస్సేన్‌సాగర్‌లో ప్రారంభమైన పారిశుద్ధ్య పనుల ప్రక్రియ - Ganesha immersions in Tankbund