Telangana Congress Public Meeting in Chevella : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి బీఆర్ఎస్(BRS) నాయకులు ఓర్వలేకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈనెల 27న జరిగే ముఖ్యమంత్రి సమావేశం సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం వారికి దిశానిర్దేశం చేసి ప్రసంగించారు.
Public Meeting Arrangements in Chevella : ఈ పథకాలను చేవెళ్ల నుంచి ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్‌గా మారిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR) కూడా పాదయాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. అందుకే చేవెళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
Minister Sridhar Babu Fires on BRS : ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేసే బాధ్యత కార్యకర్తలకు ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆమె రూ.500 గ్యాస్ సిలిండర్(Gruha Jyothi Scheme)తో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం వంద రోజుల వ్యవధిలో నాలుగు హామీలు పూర్తి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నామని ఆయన వివరించారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాకముందే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఈ నెల 27న ప్రకటించబోతున్నాం. రాబోయే రోజుల్లో ఇంటికో మహిళకు రూ.2500 ఇచ్చే విదంగా కార్యాచరణ చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను నిర్దేశించిన సమయంలో అమలు చేసి తీరుతాం." - శ్రీధర్ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ఈ కార్యక్రమానికి సునీతా మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ భీమ్ భరత్, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు సభా స్థలికి చేరుకొని అక్కడ పనులను సమీక్షించారు. అధికారులతో మాట్లాడి పనుల పురోగతిపై వివరాలను తెలుసుకున్నారు.
చెరకు సాగు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభం ఒకేసారి : శ్రీధర్ బాబు
ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం - అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన