TS CEO Vikas Raj on Telangana Lok Sabha Election 2024 : సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత నామినేషన్ల దరఖాస్తులను పరిశీలించి 525 మంది అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. అత్యధికంగా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీలో ఉన్నారని వివరించారు. అలాగే 285 మంది స్వతంత్రులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎన్నికల భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు వాడాల్సి వస్తుందని ఈసీ వికాస్ రాజ్ తెలిపారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ఒక్క ఈవీఎం మాత్రమే సరిపోతుందని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి అదనంగా కొన్ని ఈవీఎంలు రప్పిస్తున్నామని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్‌ను జిల్లాల్లో ప్రింట్ చేస్తున్నారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ చెప్పారు.
2.94 లక్షల మంది ఎన్నికల సిబ్బంది : అన్ని చోట్లా ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో 3,986 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధులకు 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. 2.94 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నామని, పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ఈసీ వికాస్‌రాజ్ చెప్పారు.
ఎన్నికల ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబరు : ఎన్నికల ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 1950 ఏర్పాటు చేశామన్నారు. టోల్ ఫ్రీ నంబరు ద్వారా ఇప్పటివరకు 1,227 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్నారు. 15 వేల మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇంటి దగ్గర ఓటు వేసే వారి దగ్గరకు ఈ నెల 5,6న తమ సిబ్బంది వెళ్తారని, ఇంటి దగ్గర ఓటు వేసేందుకు 10 వేల మందికి అవకాశం కల్పించామని స్పష్టం చేశారు.
"సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 285 స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నారు. ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు వాడాల్సి వస్తుంది. 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు వాడాల్సి వస్తుంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ఒక ఈవీఎం సరిపోతుంది. ఈసీకి చెప్పి అదనంగా కొన్ని ఈవీఎంలు రప్పిస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్‌ను జిల్లాల్లో ప్రింట్ చేస్తున్నారు. అన్ని చోట్లా ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతోంది. హైదరాబాద్‌లో 3,986 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశాం. ఎన్నికల విధులకు 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయి. 2.94 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నాం." - వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి